మహాదేవపూర్, ముద్ర:
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లిలోని హెచ్‌పీ గ్యాస్, సింగరేణి కాలరీస్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ఎల్పీజీ డీలర్లు వినియోగదారుల బుకింగ్ సీక్వెన్స్‌ను తప్పనిసరిగా పాటిస్తూ గ్యాస్ రీఫిల్స్‌ను సరఫరా చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమాన్ని అతిక్రమించకూడదని ఆదేశించారు.
జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి కొందరు వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ రోజువారీ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.