Take a fresh look at your lifestyle.

గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు కలెక్టర్ ప్రతిమా సింగ్ భరోసా 134 సిలిండర్ల సీజ్, 83 కేసులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారికి యధావిధిగా డెలివరీ జరుగుతుంది, వదంతులు నమ్మవద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
పెట్రోల్, డీజిల్, ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కలెక్టర్ తీవ్రంగా ఖండించారు. గ్యాస్ సమృద్ధిగా ఉందన్నారు. రోజుకు సగటున 3 వేల సిలిండర్లు బుక్ అవుతుండగా, వాటికి 100 శాతం డెలివరీ జరుగుతోందన్నారు. అదనంగా జిల్లాలోనీ గ్యాస్ గోదాముల్లో సుమారు 3500 సిలిండర్లు నిల్వ ఉండగా, మరో 6500 సిలిండర్లు ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బంకులు, 16 గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొన్ని పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న క్యూలు వదంతుల కారణంగా ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లే ఏర్పడుతున్నాయని తెలిపారు.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు సివిల్ సప్లైస్, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ, పోలీస్ శాఖల సంయుక్త బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో పలు హోటల్లు రెస్టారెంట్ల యజమానులు గృహ అవసరాల కోసం వాడే 134 సిలిండర్లను సీజ్ చేసి 83 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే వాహనా ల్లో ఇంధనం తక్కువగా ఉంటే తప్ప బంకులకు వెళ్లొద్దన్నారు.. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వచ్చే ధృవీకరించని వార్తలను ఇతరులకు పంపవద్దన్నారు.. ప్రభుత్వం లేదా చమురు కంపెనీల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి అన్నారు. వదంతులను నమ్మకుండా సంయమనం పాటిస్తే, ఈ క్యూ లైన్లు మాయమవుతాయి. ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 9391942254 ను సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.