Take a fresh look at your lifestyle.

సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి మంత్రి జూపల్లి కృష్ణారావు

 


ముద్ర, వనపర్తి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతూ, ప్రతి అర్హుడికి లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొల్లాపూర్ నియోజకవర్గం పరిధి వీపన్ గండ్ల మండలానికి సంబందించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు మంజూరు అయినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం ప్రారంభించక పోవడానికి గల కారణాలను వ్యక్తిగతంగా తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతున్నట్లయితే, స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు కల్పించి వారికి సహకరించాలని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులు అధిక వడ్డీ రుణాలు లేదా అప్పులు చేయకుండా అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక సహాయంతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పథకం సక్రమంగా అమలవుతూ ప్రతి అర్హుడికి లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా వీపనగండ్ల మండల పరిధిలో ఆయా గ్రామాల్లో రైతుల భూ సమస్యల పైన వచ్చిన అర్జీలపై మంత్రి సమీక్షించారు. వీపనగండ్ల గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్లు 389, 399, 400, 588, 589 లలో రెండు వర్గాల మధ్య ఉన్న భూ సమస్యను వెరిఫై చేసి పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. దాంతోపాటుగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పెట్టుకున్న భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను సత్వరం పరిష్కరించి న్యాయం చేకూర్చాలన్నారు. రైతులు ప్రజల అర్జీలకు సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో బదులు ఇవ్వాలని తెలియజేశారు. రైతులపై ఫిర్యాదులపై తహసిల్దార్లు క్షేత్రస్థాయికి వెళ్లి వెరిఫై చేసి సమస్య పరిష్కారం దిశగా మార్గం చూపాలన్నారు. రాబోయే 15 రోజుల్లో రైతుల అర్జీలు అన్నిటిని పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు ఏ స్థాయి వారైనా సరే చట్ట విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ఇతర అధికారులు, వీపనగండ్ల మండల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.