ముద్ర, మోత్కూర్:
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్న సందీప్ కుమార్ పొట్టేపాక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ఫర్డ్ విశ్వావిద్యాలయం లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించేందుకు ఎంపికయ్యి మరో అరుదైన గుర్తింపు సాధించారు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రాజకీయ విద్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక కాన్ఫ్రెన్స్ కు దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా సందీప్ నిలవడం విశేషంగా నిలిచింది.యునైటెడ్ కింగ్‌డమ్ తో సహా ఈ సదస్సులో హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తో పాటు కింగ్స్ కాలేజ్ లండన్, వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుండి 900కు పైగా అకడమిషియన్లు పాల్గొంటున్నారు. పాపులిజం, సంక్షేమ విధానాలు, ఓటరు ప్రవర్తన, ప్రపంచ రాజకీయ ధోరణులు వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు ఈ వేదికపై జరగనున్నాయి.
మార్చి 30 నుండి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో “Populism, Welfare and the Discerning Voter” అనే సమకాలీన అంశంపై సందీప్ తన పరిశోధనను ప్రదర్శించనున్నారు. సందీప్ సమర్పించనున్న పరిశోధన సంక్షేమ రాజకీయాలపై కేంద్రీకృతమై ఉండి, తెలంగాణలో సంక్షేమ విధానాలు, నియోలిబరల్ ఆర్థిక పరిమితులు మరియు ఓటర్ల మద్దతు మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషిస్తుంది. గతంలో సందీప్ ఫ్రాన్స్‌లో జరిగిన ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ అసోసియేషన్ (IPPA) నిర్వహించిన వింటర్ స్కూల్‌లో పాల్గొని పబ్లిక్ పాలసీపై వర్క్‌షాపులు నిర్వహించారు.మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన సందీప్, అంతర్జాతీయ రాజకీయ,శాస్త్రీయ దృక్పథంతో సాగుతున్న సందీప్ పరిశోధనలు , అంతర్జాతీయ సదస్సులకు ఎంపిక కావడం పట్ల జాతీయ పత్రికలో తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం ద్వారా అకాడమిక్ వర్గాల లో విశేష ప్రశంసలు వెల్లువెత్తాయి, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.