ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరచాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని సిటి స్కాన్ యంత్రం పని చేయక నెలలు గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోవటం లేదన్నారు. ఫలితంగా నిరుపేద రోగులు వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.భైంసా ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించడం లేదని, ఉదయం 11:30 గంటలకే ఓపీ గదులు ఖాళీ అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు సరైన వైద్యం అందించకుండా, నిర్మల్ తదితర ప్రాంతాలలోని ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న సంఘటనలు చాలా కాలంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.