ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సాయంత్రం 5 గంటలకు ముగిసిన ఈ. ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న ఘటనలు తప్ప ఎలాంటి ఘర్షణులు చోటు చేసుకోలేదు. ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ లోనిపలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రవి హైస్కూల్, ప్రిన్స్ హైస్కూల్, టీఎన్జీఓ హాల్, ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.పోలింగ్ సరళిని స్వయంగా గమనించిన కలెక్టర్, ఎస్పీ జానకి షర్మిల , అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ లు ఓటర్లు ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో ఓటింగ్ వేగంగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యత కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. మోడల్ పోలింగ్ కేంద్రం ఎదుట ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఓటర్లతో కలిసి ఫోటో దిగారు. భైంసాలోని మోడల్ పోలింగ్ కేంద్రాలకు సందర్శించి సౌకర్యాలపై ఆరా తీశారు. మధ్యాహ్నం మూడు గంటలవరకు నిర్మల్ లో 63 శాతం, ఖానాపూర్ లో 60 శాతం, భైంసాలో 52 శాతం చొప్పున జిల్లా వ్యాప్తంగా 59 శాతం ఓటింగ్ జరిగింది. ఇదిలా ఉండగా నిర్మల్ ఎంఎల్ఏ,బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గాజులపేట పోలింగ్ కేంద్రంలో తమ ఓటు వేసారు.
