Take a fresh look at your lifestyle.

ఇంద్రకల్ లో ముగిసిన వ్యవసాయ కళాశాల విద్యార్థుల జాతీయ సేవా పథకం సేవలు…. సేవయేలక్ష్యం- సమాజమే దేవాలయం..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

సేవయే లక్ష్యం – సమాజమే దేవాలయం అనే నినాదంతో పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఇంద్రకల్‌లో శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది.గత ఏడు రోజులుగా స్థానిక గ్రామంలో అంకితభావంతో సేవలు అందించిన విద్యార్థుల కృషిని గ్రామస్తులు మరియు కళాశాల యాజమాన్యం కొనియాడింది. ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు వి. శ్రీరమ్య మరియు ఎన్.నవత పర్యవేక్షణలో ఈ ఏడు రోజుల శిబిరం క్రమశిక్షణతో సాగింది.
ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలెం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కె. సుహాసిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,”పుస్తకాల్లో చదివే చదువు కంటే, క్షేత్రస్థాయిలో రైతుల కష్టసుఖాలను తెలుసుకున్నప్పుడే ఒక విద్యార్థి సంపూర్ణ వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదుగుతాడనీ అన్నారు. ఏడు రోజుల పాటు గ్రామంలో పారిశుధ్యం, ఆరోగ్యం మరియు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించిన వాలంటీర్ల కృషి అభినందనీయం అని పేర్కొన్నారు.


కార్యక్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. స్రవంతి గారు మాట్లాడుతూ,సామాజిక బాధ్యతను అలవర్చుకోవడంలో ఎన్.ఎస్.ఎస్ పాత్ర కీలకమని తెలిపారు. స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ, విద్యార్థులు రైతులకు చేదోడు వాదోడుగా నిలవడం సంతోషకరమని అన్నారు.ముగింపు రోజున విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ నమూనాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమగ్ర వ్యవసాయ పద్ధతి యొక్క ప్రయోజనాలు, సేంద్రియ ఎరువుల తయారీ విధానం, పంట మార్పిడి మరియు తెగుళ్ల నివారణా పద్ధతులు మరియు మరెన్నో
అంశాలపై విద్యార్థులు నమూనాల ద్వారా వివరించిన తీరును చూసి రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థులు తమ సందేహాలను ఎంతో ఓపికగా తీర్చారని పలువురు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు పాడిన పాటలు,చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం,శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు,బహుమతులు అందజేశారు. అదేవిధంగా,గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు కూడా అతిథుల చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి లెక్చరర్లు మోతీలాల్ నాయక్ మరియు వైష్ణవి గారు కూడా నాయకత్వం వహించారు.విద్యార్థులు కావ్య, శివాని, జగన్, శంకర్ ఈ కార్యక్రమంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.రైతులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వెంకటయ్య మరియు వినోద్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ,గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన కళాశాల సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
సర్పంచ్ బంగారమ్మ విద్యార్థులు రైతులకు చేసిన సేవలు, గ్రామానికి చేసిన సేవలను ప్రత్యేకంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల చివరి సంవత్సర విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.