ముద్ర, వికారాబాద్ బ్యూరో : వికారాబాద్ పట్టణ పరిధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన చాకలి లాలయ్య (35) తన కుమారుడు చాకలి రిథిక్ (6)తో కలిసి మోటార్ సైకిల్ నంబర్ TS 34 6577 పై వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వారి వెనుక చాకలి లాలయ్య భార్య మేఘన తన కుమార్తె రిషిక (7)తో కలిసి తన స్కూటీ నంబర్ TS 34 J 5735 పై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ నుండి తాండూర్ వైపు వెళ్తున్న లారీ నంబర్ HR 38 Y 0333 క్రేన్ లోడ్‌తో ఉన్న లారీ డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ, ఎదురుగా వచ్చి ముందు వెళ్తున్న లాలయ్య మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి, అనంతరం స్కూటీని కూడా ఢీకొట్టాడు. దీంతో లారీ నియంత్రణ కోల్పోయి, లారీ క్రేన్ రెండు కింద పడిపోయి చాకలి లాలయ్య, అతని కుమారుడు రిథిక్ పై పడినాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించిన అనంతరం, రిథిక్ బాలుడు ఉదయం 08:38 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు. చికిత్స పొందుతూ చకాలి లలయ్య ఉదయం 10:37 గంటలకు మృతి చెందారు. విచారణలో లారీ డ్రైవర్ ఎమ్.డి. షకీర్ (36) హర్యానా రాష్ట్రం, మద్యం సేవించి వాహనం నడిపినట్లు ప్రాథమికంగా తేలిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ రఘు తెలిపారు