ముద్ర ప్రతినిధి, మెదక్:
పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇండ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితులు తెలిపారు.

విషయం తెలుసుకున్న ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు పోలీసులు అండగా ఉంటారని, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు. చోరీ ఘటనపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాల్లో రాత్రి పహారాను మరింత పెంచాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా చోరీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలు తమ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వెంట మెదక్ డియస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రేణుక రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పెద్ద శంకరంపేట్ పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది ఉన్నారు.
ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించాలి
పాపన్నపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజు సాయంత్రం వాహనాల తనిఖీ చేయట్టాలని ఆదేశించారు. ఈ తనిఖీలో డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా పోలీసు అధికారులతో కలిసి అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూ, ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. ప్రతి కేసు స్థితిగతులను తెలుసుకుని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు జార్జ్, వెంకట రాజా గౌడ్, మహేష్, రేణుక రెడ్డి, జాన్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు జిల్లా ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.