Take a fresh look at your lifestyle.

తండాలు, గూడేలకు మహార్ధశ తెస్తాం-సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

రోడ్లు, పాఠశాలలు, పంచాయతీ భవనం, తాగునీరు, కరెంట్ ఇస్తాం
నల్లమల్లలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం
సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఉన్న అన్ని తండాలు, గూడాలకు మహార్దశ చేకూర్చుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాటికి తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని చెప్పారు. తాగడానికి మంచినీరు, కరెంట్ అందించాలన్న సీఎం.. అటవీ ప్రాంతాల్లో ఉండే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కరెంట్ లేని చోట సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆదివారం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామనిప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని అన్నారు. ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించినందున, అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మానవజాతి శాంతి మార్గంలో, చెడును విడిచి, భక్తితో సన్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్ దేశంలో 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలిచారని సీఎం కొనియాడార. అలాంటి మహనీయుని జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర ఎవరూ మరువలేనిదని వెల్లడించారు. వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు ప్రతి సందర్భంలోనూ లంబాడా సోదరులు తనకు అండగా నిలిచారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్న సీఎం… నిరుపేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని చెప్పారు. నిరక్షరాస్యత కారణంగా చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నిరుపేదలు చదువుకోవడానికి కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో కష్టపడి చదువుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం ఉద్బోధించారు. ఈ సందర్భంగా సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం… అంతకుముందు బంజారాలు ప్రదర్శించిన ఉత్పత్పులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ పొరిక బలరాం నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.