Take a fresh look at your lifestyle.

.ఎస్ఎల్ బీసీ పునరుద్దరణ ఎన్నడో…?

– నల్లగొండ జిల్లా కు సాగు, తాగునీరు అందించే బ్రహత్తర పథకం ఎస్ ఎల్ బీ సీ
– 2005 లో ఈ సొరంగం పనులు మొదలై 2010 లో పూర్తి కావాల్సిన పనులు నేటికీ కొనసాగుతున్నాయి
– గత ఏడాది సొరంగం లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం తో నిలిచి పోయిన పనులు
– మళ్ళీ పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
– సొరంగం పనులు పూర్తయితే నల్లగొండ జిల్లాలో 4.18 లక్షల ఎకరాలకు సాగు, 516 ప్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీటి సౌకర్యం
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( ఎస్ ఎల్ బీ సీ ) పనులు ఎప్పుడు పూర్తవుతుందోనని నల్లగొండ రైతాంగం, ప్లోరైడ్ పీడిత గ్రామాల ప్రజలు ఎదురు చూసి చూసి విసిగిపోయారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా ఇంకా పనులు ముందుకు సాగడం లేదు.శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి సొరంగ మార్గం ద్వారా నల్లగొండ జిల్లాకు నీరందించే ఈ బ్రహత్తర ప్రాజెక్టు కు 2005 లో అప్పటి ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.2010 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉదేశ్యం. ఈ సొరంగ( టన్నెల్ ) మార్గాన్ని రెండు విధాలుగా చేపట్టాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ ( టీ బీ ఎం )ద్వారా సొరంగం తవ్వి వాటిద్వారా నీటిని తరలించాలని అధికారుల అంచనా.టీ బీ ఎం ద్వారా 43.5 కిలోమీటర్లు సొరంగం తవ్వాల్సి ఉంటుంది. నల్లగొండ వైపు నుంచి డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో 7.25 కిలోమీటర్లు సొరంగ మార్గం తవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు పద్దతుల ద్వారా సొరంగ మార్గం పూర్తి చెయ్యాలన్నది ప్రభుత్వ ఉదేశ్యం.అభయారణ్యం లో సొరంగ మార్గం తవ్వాలంటే అతి కష్టం తో కూడుకున్న పని. సొరంగ మార్గం టీ బీ ఎం మిషన్ తవ్వుతున్నప్పుడు ఎన్నో అవాంతరాలు జరిగాయి. మిషన్ లు పాడవడం, టెక్నికల్ వంటి సమస్య లు ఎన్నో వచ్చి సొరంగ మార్గం పనులు ముందుకు సాగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ హయాంలో పనులు చురుకుగా సాగినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాజెక్టు పనులను కెసిఆర్ పట్టించుకోలేదు. వై ఎస్ హయాంలో ఈ సొరంగ మార్గం దాదాపు 52 శాతం పనులు పూర్తయ్యాయని అప్పటి నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించారు. కెసిఆర్ ముఖ్య మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ప్రాజెక్టు కు తగినంత నిధులు కేటాయించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూ. 2647 కోట్లు ఈ ప్రాజెక్టు కు ఖర్చు చేసింది. కెసిఆర్ హయాం కేవలం పదేళ్లలో ఈ ప్రాజెక్టు కు రూ. 500 కోట్లు కేటాయింపులు చేసింది. కానీ నిధులు పూర్తి మొత్తం లో ఖర్చు చేయలేదనే విమర్శలు కెసిఆర్ పై అప్పట్లో చాలానే వచ్చాయి. ఈ పదేళ్ల కాలం లో కేవలం 23 శాతం పనులు జరిగాయి.2019,20,21 ఈ మూడేళ్ళ లో ఈ సొరంగ మార్గం పనులకు కెసిఆర్ ప్రభుత్వం కేవలం రూ. 10 కోట్లు కేటాయించిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.కెసిఆర్ తన సీఎం పదవి కాలం లో ఈ ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి పెద్దగా శ్రద్ద చూపలేదనే విమర్శలు వచ్చాయి. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయం లో నే ఈ సొరంగ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగాయని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడం ముఖ్య మంత్రి గా ఎనుముల రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టిన వెంటనే ఈ ఎస్ ఎల్ బీ సీ పై దృష్టి పెట్టారు. టీబీఎం మిషన్ ద్వారా ప్రాజెక్టు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని నిధులైన ఖర్చు చేసి నల్లగొండ జిల్లా కు నీరందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఇంకా 25 శాతం పనులు పూర్తవుతే సొరంగం పూర్తిగా అందుబాటులోకి వచ్చి నీటినీ తరలించే అవకాశం ఉంటుందని సీఎం ప్రకటించారు. పెండింగ్ లో 25 పనులు పూర్తి చేస్తామని సీఎం పేర్కొనడం తో ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
……………………………………
సొరంగం పనుల్లో ప్రమాదం :
…………………………………..
రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చిన వెంటనే ఎస్ ఎల్ బీ సీ పనులు మళ్ళీ మొదలయ్యాయి. ఇక ప్రాజెక్టు పూర్తవుతుందని అందరూ అనుకున్నారు. కానీ కెసిఆర్ పదేళ్ల కాలం లో ఈ ప్రాజెక్టు ను పట్టించుకోక పోవడం తో సొరంగ మార్గం లో నీటి ఊట అధికంగా ఉండడం, బురద ఏర్పడం వంటివి సొరంగం లో ఏర్పడడం తో టీబీఎం మిషన్ కు పనులు చేయడం లో ఇబ్బంది పడింది. అలాగే పనులు కొనసాగుతుండడం తో నీటి ఊట ఎక్కువై గత ఏడాది ఫిబ్రవరి లో టన్నెల్ లో ప్రమాదం సంభవించింది. టీబీఎం మిషన్ సొరంగం తవ్వుతున్న సమయం లో ఒక్కసారిగా బురద మట్టి టన్నెల్ మొత్తం కప్పేసింది. దీంతో టన్నెల్ మొత్తం బురద తో నిండిపోవడం తో టీబీఎం మిషన్ పూర్తి గా మునిగి పోయింది. పనిచేస్తున్న కార్మికులు బురద లో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. మిషన్ ఆపరేటర్ తో పాటు ఎనిమిది మంది కార్మికులు ఈ ప్రమాదం లో చనిపోయారు. దీంతో టన్నెల్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటి కి ఈ ప్రమాదం జరిగి ఏడాది కావస్తోంది. మళ్ళీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టడం లేదు. బురద లోకూరుకుపోయిన టీబీఎం మిషన్ బాగాలను బయటకు తీసివేస్తే పనులు కొనసాగడానికి వీలుంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.
………………………………….
ఎస్ ఎల్ బీ సీ పనులు
పూర్తి చేస్తా :
……………………….…………….
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులు రెండేళ్లలో పూర్తి చేసి నల్లగొండ జిల్లా కు సాగు, తాగు నీరు అందిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు లో భాగంగా టన్నెల్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం జరుగుతుంటే కెసిఆర్ చేసిన తప్పిదానికి టన్నెల్ లో ప్రమాదం జరిగిందని, టన్నెల్ లో ఉన్న టీబీఎం మిషన్ వ్యర్థాలను తొలగించి వెంటనే పనులు ప్రారంభిస్తామని సీఎం పేర్కొన్నారు.రెండేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం ప్రకటించారు.సీఎం ప్రకటన తో ఎస్ ఎల్ బీసీ పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.
…………………………………..
నల్లగొండ కు వరం
ఎస్ ఎల్ బీసీ :
…………………………………….
ఎస్ ఎల్ బీసీ టన్నెల్ పనులు పూర్తవుతే ఉమ్మడి నల్లగొండ జిల్లా రూపురేఖలు మారుతాయి. జిల్లాలోని పలు ప్రాంతాలను ఈ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీ ల నీరు అందుతుంది. నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో 4.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇదే జిల్లా లో 516 ప్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణ నది మంచి నీరు అందుతుంది. ఈ జిల్లా లో ప్లోరైడ్ బాధితుల సంఖ్య అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కెసిఆర్ ఉద్యమ సమయంలో నల్లగొండ జిల్లా ప్లోరైడ్ గ్రామాలను ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదని విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం గా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన పదేళ్ల కాలం లో నల్లగొండ జిల్లా ప్లోరైడ్ ప్రాంతాలకు మంచి నీరు అందించే ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు ను పట్టించుకోలేదు.కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసి నల్లగొండ జిల్లా నుంచి ప్లోరైడ్ ను శాశ్వతంగా రూపుమాపాలని కంకణం కట్టుకున్నారు. ఇదేళ్ల లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు రెండు దశాబ్దాల కాలమైనా పూర్తి కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తో ఈ రెండేళ్లలో పూర్తి అవుతుందని ఆశిద్దాం.
………………………………….

Leave A Reply

Your email address will not be published.