Take a fresh look at your lifestyle.

సహకార సంఘాల ద్వారా 3 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం

  • రాష్ట్ర ఐటి,పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు.
  • 4 పిఏసిఎస్ ఆధ్వర్యంలో ముందస్తుగా సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు.
  • గుంజపడుగు ప్యాక్స్ కార్యాలయం నందు పీఎం కుసుమ్ క్రింద సోలార్ ప్రాజెక్ట్ మంజూరు పత్రాలు అందించిన మంత్రి శ్రీధర్ బాబు.

మంథని, ముద్ర విలేకరి: 3 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ను మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం మంథని మండలం గుంజ పడుగు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ లో 2.90 కోట్ల నిధులతో పీఏం కుసుమ్ కార్యక్రమం క్రింద చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టు మంజూరి పత్రాలను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కే. రవీందర్ రావు,జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కుసుమ్ పథకాన్ని రైతులకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అనుకూలంగా ఉండేలా రాష్ట్రంలోనే మొదటిసారిగా మన జిల్లాలో 4 చోట్ల సోలార్ ప్రాజెక్టు మంజూరు చేసుకున్నామని ,దీనికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పిఏసిఎస్ మంథని,పిఏసిఎస్ అప్పన్నపేట, పిఏసిఎస్ కాల్వ శ్రీరాంపూర్, పిఏసిఎస్ ధర్మారం, పిఏసిఎస్ చొప్పదండి పరిధిలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కరీంనగర్ సహకార బ్యాంకు నుంచి 3 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసినందుకు సంబంధిత అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం వ్యవసాయ సహకార సంఘాలకు సోలార్ ప్రాజెక్టు ద్వారా 50 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న ప్యాక్స్ ద్వారా సంవత్సరానికి 7300 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పెట్రోల్ పంప్,రైస్ మిల్ వంటి వివిధ వాణిజ్య వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు కృషి జరుగుతోందని అన్నారు.జిల్లాలో ఉన్న 131 పిఏసిఎస్ లలో కూడా పీఎం కుసుమ్ క్రింద సోలార్ ప్రాజెక్టు విస్తరించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ అవసరాలను తీరుస్తూ మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాలకు ఆదాయ వనరులు సృష్టిస్తున్నామని మంత్రి తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.రైతులకు, పరిశ్రమలకు గృహ వినియోగదారులకు ఇబ్బంది రావద్దని ప్రజా ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చిందని,3 వేల మెగావాట్ల ఉత్పత్తి మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా,ఆధునిక పరికరాల సబ్సిడీ,సన్న వడ్లకు బోనస్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రైతులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు.విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ఎక్కడ కూడా కోతలు విధించడం లేదని,200 యూనిట్ల వరకు ఉచితంగా పేదలకు సరఫరా చేస్తున్నామని అన్నారు. జిల్లాలో సహకార సంఘాల తో పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కు కలెక్టర్ అధ్యక్షతన కృషి చేయాలని మంత్రి సూచించారు.

  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ…

పీఎం కుసుమ్ క్రింద ప్రతి మండలంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మన జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలచే కూడా సోలార్ ప్రాజెక్టు పెట్టించాలని నిర్ణయించి ముందుగా గుంజపడుగు, అప్పన్నపేట, ధర్మారం కాల్వ శ్రీరాంపూర్ 4 ప్యాక్స్ ఎంపిక చేసి అవసరమైన భూమి గుర్తించి మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఎన్ పిడిసిఎల్ తో చర్చించి ప్రాజెక్టు ఆమోదింప చేశామని,నాబార్డు వారు కూడా అతి తక్కువ ఒక్క శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేశారని, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం కనీసం 50 నుంచి 70 లక్షల వరకు ఆదాయం వస్తుందని , ప్యాక్స్ వద్ద నిధులు అందుబాటులో ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డిఓ సురేష్, అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.