Take a fresh look at your lifestyle.

మాటల్లోనే రైతు సంక్షేమం – కేంద్రం చేతల్లో శూన్యం : మంత్రి తుమ్మల

ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం కరువు
పసుపు బోర్డుకు నిధుల్లేవు

ముద్ర, ఖమ్మం :

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులపై అదనపు భారాన్ని మోపేలా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం ప్రసంగాల్లో రైతు సంక్షేమం గురించి చెబుతున్నా.. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అది ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సాహానికి కాంగ్రెస్ సర్కార్… కృషి చేస్తుంటే కేంద్రం మాత్రం అందుకు అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రైతులకు, రాష్ట్ర వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. సోమవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం పెంచాలని తాము పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. దీంతో దేశీయ రైతులకు గిట్టుబాటు ధర లభించడం కష్టతరమవుతోందన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన జాతీయ పసుపు బోర్డుకు బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కూడా కేటాయించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బోర్డు ఏర్పాటు పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆచరణలో రైతులకు మేలు చేసే నిధులు కరువయ్యాయని అన్నారు. తెలంగాణలో కొబ్బరి సాగు గణనీయంగా పెరుగుతున్నా, రాష్ట్రంలో కొబ్బరి బోర్డు ఏర్పాటుపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన కేంద్రం, ఎరువులపై సబ్సిడీలు తగ్గించడం ద్వారా ధరలు పెరిగేలా చేస్తోందని మంత్రి విమర్శించారు. ఎరువుల ధరల పెంపుతో సాగు ఖర్చులు భారమై, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. నిర్మలా బడ్జెట్ తెలంగాణ రైతుల ఆశలపై నీళ్లు చల్లిందని, కేంద్రం తన వైఖరిని మార్చుకుని రాష్ట్రానికి రావాల్సిన వాటాను, నిధులను వెంటనే కేటాయించాలని తుమ్మల డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.