Take a fresh look at your lifestyle.

రేషన్ కార్డుల తొలగింపు…?

 

ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని వారి కార్డులు రద్దు
లబ్దిదారులు సన్నబియ్యం తీసుకోవడం లేదని ప్రభుత్వానికి నివేదికలు
అనర్హులను గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నం
మండల స్ధాయి నుంచి రాష్ట్రానికి అనర్హుల లెక్కలు
ఏప్రిల్ లో మూడు నెలల బియ్యం
వేసవి దృష్యా కేంద్రం కీలక నిర్ణయం
అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌరసరఫరాల శాఖ లేఖ
తెలంగాణలో సన్నబియ్యం నిల్వలపై బెంగ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రేషన్ సరఫరాలో ప్రభుత్వం కీలక మార్పులకు సమాయత్తం అవుతోంది. ప్రతీ నెలా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కొందరు లబ్దిదారులు తీసుకోవటం లేదనే అంశం ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో…అనర్హులను గుర్తించే అంశం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి లెక్కలు చేపట్టే పని ప్రారంభించింది. రేషన్‌ లబ్ధిదారుల్లో వరుసగా గత ఆరు నెలలుగా ఎవరెవరు బియ్యం తీసుకోవడం లేదో, ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్‌ ఆఫీస్​ లాగిన్‌కు సిబ్బంది పంపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో కొత్త కార్డులను మంజూరు చేసింది. వీరిలో చాలామంది సన్న బియ్యం తీసుకోవటం లేదని గుర్తించారు. దీంతో అసలు కారణాలేమిటో గుర్తించాలని అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు.. కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయం లో లబ్దిదారులకు మంజూరు పైన జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్నారు. దీంతో, తాజా ప్రతిపాదనల మేరకు పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులకు కోత పడే అవకాశం కనిపిస్తోంది. కాగా 2026 జనవరి నాటికి తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల (ఆహార భద్రత కార్డులు) సంఖ్య 1,04,35,848 కు చేరింది. గతేడాది కాలంలో సుమారు 14.40 లక్షలకు పైగా కొత్త కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రేషన్ కార్డుల ద్వారా సుమారు 3.35 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు సన్నబియ్యం రేషన్ సరుకులను పొందుతున్నారు.

క్షేత్ర స్థాయి నివేదికల మేరకు నిర్ణయం
కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం తీసుకొని వాటిని రూ. 10 నుంచి రూ. 20 వరకు అమ్ముకుంటున్న అంశం పైన క్షేత్ర స్థాయి నుంచి అధికారులు సమాచారం అందించారు. దీంతో ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పక్క దారి పడుతోందని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పోషకాలతో ఉన్నా.. మార్కెట్ లో దొరికే సాధారణ బియ్యం వైపే మొగ్గు చూపుతున్నట్లు గుర్తించారు. దీంతో.. ప్రభుత్వం ఆరు నెలల పాటు బియ్యం తీసుకోని వారి జాబితాలను సిద్దం చేయాలని పౌర సరఫరాల శాఖ కు సూచించింది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి అధికారులు నివేదికలను సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా ఆరు నెలలు రేషన్ తీసుకోని వారి కార్డులను రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని పైన పూర్తి నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలల సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీలావుంటే… దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య పెరిగింది. దాదాపు కోటికి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి మూడు నెలలకు సరిపడ కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

బియ్యం నిల్వ ఎలా…?
ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా మూడు నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండటంతోపాటు.. డీలర్లు, హమాలీ కూలీ కలిసొచ్చే అవకాశముంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు సమస్యగా మారింది. ఇక మూడు నెలలకు సంబంధించి మూడు ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర (థంబ్) వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వస్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 15-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.