ముద్ర ప్రతినిధి, నిర్మల్:
చారిత్రక ప్రాధాన్యత ఉన్న నిర్మల్ కట్టడాలను పరిరక్షించి, నిర్మల్ చరిత్రను భావి తరాలకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి వెల్లడించారు. పట్టణంలోని బత్తిస్ ఘడ్, శ్యామ్ ఘడ్ లను ఆయన శుక్రవారం సందర్శించారు. చారిత్రక కట్టడాలుగా పేరున్న ఘడ్ లను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు తీసుకోచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వీటి పరిసరాలను అభివృద్ధి చేస్తే నిర్మల్ వాసులు సేదదీరేందుకు అవసరమైన పార్క్ కొరత తీరుతుందన్నారు. వీటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కోరినట్లు తెలిపారు. పనులు, అవసరాలపై నివేదిక తయారు చేసేందుకు హైదరాబాద్ లోని ఎస్ కె ఏజెన్సీకి అప్పజెప్పినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపు గోపి, ఎస్పీ రాజు, మాజీ కౌన్సిలర్లు ధర్మాజీ శ్రీనివాస్, నల్లూరి పోశెట్టి, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, గుర్రం సత్యం, అడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.