- పోలీస్ అధికార్లు, సిబ్బందిని ప్రశంసించిన ఎస్పీ రోహిత్ రాజు.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి వాటిని తిరిగి భాదితులకు అందజేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ఈ ఫోన్లను బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులతో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టడం జరిగితుందన్నారు.వీటన్నిటినీ బాధితులు గత రెండు నెలల వ్యవధిలో పోగొట్టుకున్నారని తెలిపారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో అడిగిన అన్ని వివరాలను కచ్చితంగా నమోదు చేస్తే, సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టడం జరుగుతుందని చెప్పారు.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను అవతల వ్యక్తి వినియోగించాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే అట్టి మొబైల్ను ట్రేస్ చేయగలమని అన్నారు. ఎవరైనా తమ మొబైల్ దొంగిలించబడినా, పోగొట్టుకున్నా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని కోరారు. గడిచిన ఐదు నెలల కాలంలో మొత్తం 743 మొబైల్ ఫోన్లను కనిపెట్టి భాదితులకు అందజేశామని చెప్పారు.ఈ సందర్భంగా బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటి సెల్ ఇంచార్జి సీఐ రాము, ఎస్సై సురేష్, ఐటి సెల్ సభ్యులు నవీన్, నరేష్,మహేష్, నరేన్ తదితరులు పాల్గొన్నారు.
