యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: గైర్హాజరు ఉద్యోగులపై సానుభూతి దృక్పథంతో, సమగ్రమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ.. సింగరేణి రామగుండం రెండవ డివిజన్ జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య, బుధవారం గైర్హాజర్ ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం స్థానిక సిఈఆర్ క్లబ్ లో ఏరియా డీజీఎం పర్సనల్, అధికార ప్రతినిధి పి.అరవింద్ రావ్ అధ్యక్షతన జరిగిన గైర్హాజర్ ఉద్యోగుల కౌన్సిలింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఏరియాలో పని చేస్తూ, 2024 సం.రంలో 100 హాజర్ల కంటే తక్కువ, 2025 జూన్ వరకు 50 కంటే తక్కువ హాజర్లు ఉన్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యుల ఎదుట కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇక ఈ కౌన్సిలింగ్ కు ఏరియా నుండి 60 మంది గైర్హాజర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కాగా, ఉద్యోగం పట్ల వారి అభిప్రాయాలను, విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాలకు గల కారణాలు, ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. విధులను సక్రమంగా నిర్వహించినట్లైతే, యాజమాన్యం పక్షాన తన వంతు సహాయ సహకారాలను అందిస్తామని, హామీ ఇచ్చారు. ఇక విధులకు హాజరు కావడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యక్తిగతంగా వారికి, సంస్థకు జరిగే నష్టాన్ని జీఎం వారికి వివరించారు. సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం మీ అందరి అదృష్టమని, మీ తల్లిదండ్రులు ఉద్యోగం చేసిన సమయంలో ఉన్న కష్టమైన పనులు ప్రస్తుతం లేవని, కావున ప్రతి ఒక్క ఉద్యోగి తమ హాజరు శాతాన్ని పెంచుకొని, సంస్థ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆయన హితువు పలికారు. సింగరేణి సంస్థ కల్పిస్తున్న సదుపాయాలు మరెక్కడ లేవని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఇప్పటి నుండి ప్రతినెల 22 మస్టర్ల చేయాలని జీఎం వెంకటయ్య గైర్హాజర్ ఉద్యోగులకు సూచించారు. ఇంకా ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఏఐటియుసి ఏరియా నాయకుడు శ్యామ్సన్, మెడికల్ సూపరింటెండెంట్ డా.మహిపాల్, డివైపిఎం వంశీధర్, సీనియర్ పర్సనల్ అధికారి సాధన్, ఓసీపీ.3 సంక్షేమ అధికారి సాయికృష్ణ, సీనియర్ సెక్యూరిటి అధికారి షరీఫ్ మహమ్మద్ పాల్గొన్నారు.
