ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మిర్చి రైతులకు ప్రధాని మోడీ సర్కార్ అండగా నిలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకంలోని ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ (పీపీడీ-ధరల లోటు చెల్లింపు) ను అమలు చేయడం ద్వారా తెలంగాణ మిర్చి రైతులకు లబ్ధి చేకూరనుందని ఆయన వెల్లడించారు. పంట పండించేందుకు అయ్యే ఖర్చుకన్నా తక్కువ మొత్తానికి మార్కెట్లో విక్రయించాల్సిన పరిస్థితి వచ్చినపుడు, కనీసం పండించేందుకు అయిన ఖర్చును అయినా అందిస్తూ, మిర్చి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ స్పష్టం చేసిందన్నారు. ఎంఐఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పథకాన్ని తెలంగాణలో అమలు చేయడానికి సుముఖంగా ఉన్నామని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణలోని మిర్చి రైతులకు ఎలాంటి నష్టం చేకూరకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ గతనెల 4న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఖమ్మం, మహబూబాబాద్, జోగుళాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రైతులు ఎక్కువగా మిర్చి పంట పండిస్తారని, వారికి బహిరంగ మార్కెట్‌లో సాగుధర కన్నా తక్కువ ధర వస్తుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకోవాలని ఆ లేఖలో కోరామన్నారు. తాము రాసిన లేఖపై కేంద్ర వ్యవసాయ శాఖ స్పందిస్తూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద తెలంగాణలో ఉత్పత్తి అయిన మిర్చి పంటలో 1,72,135 మెట్రిక్ టన్నుల పంటకు (తెలంగాణలో ఉత్పత్తి అయ్యే మొత్తం 6,88,540 మెట్రిక్ టన్నుల మిర్చి పంటలో 25 శాతం) ఈ పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించిందన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మార్కెట్ ధరకు, సాగు ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని రైతులకు చెల్లిస్తామని వెల్లడించిందని ఆయన తెలిపారు. మిర్చి పంటకు ఎంఐఎస్ ధరను క్వింటాల్‌కు రూ.10,374 గా నిర్ధారించిందని, ఎంఐఎస్‌కు, మార్చెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలుత రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని పేర్కొందని కిషన్ రెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల దళారులు, క్వింటాలు మిర్చిని రూ.5-6వేలకే కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్న ఘటనలు దృష్టికి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చొరవ తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మిర్చి రైతులకు జరుగుతున్న నష్టంపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాల్సి ఉంటుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందన్నారు. గుర్తింపు పొందిన ఎపీఎంసీ మార్కెట్లలో మిర్చి పంటను అమ్మిన రైతులు మాత్రమే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద లబ్ధి పొందుతారని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసిందన్నారు. పంటల ధరల హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు రైతులకు కనీస ధర రావాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయ సురక్షన్ అభియాన్ (పీఎం ఆశ) పథకాన్ని తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి విరిస్తూ.. అందులో భాగంగా మిర్చి సహా హార్టికల్చర్ ఉత్పత్తుల కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం తీసుకొచ్చిందన్నారు.