ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ టీచర్ గా మారి విద్యార్థులకు బోధన చేశారు. కడెం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. సందర్శనలో భాగంగా కలెక్టర్ స్వయంగా ఏడవ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని దర్పణాలు పాఠాన్ని బోధించి, పటాలు గీయించారు. విద్యార్థుల దగ్గరుండి జవాబులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగది వంటి ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజూ అన్ని తరగతుల్లో కనీసం 15 నిమిషాల పాటు చదవడం నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే, కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫార్ములు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ సిలబస్ ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్డు పరీక్షలకు లక్ష్యంగా ఇప్పటి నుంచే చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, ఇతర వసతులపై విద్యార్థులే స్పందించేలా ప్రశ్నలు అడిగారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలో ఎంపీడీవో అరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.