రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సూచన
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న వానాకాలం–2026 వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన సన్నద్ధతపై జిల్లా స్థాయి ఎరువుల పర్యవేక్షణ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా స్థాయి ADAలు, MAOలు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హోల్‌సేల్ డీలర్లు, అలాగే PACS, ARSKS, HACAS, DCMS డీలర్లు పాల్గొన్నారు.
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులు అధికంగా యూరియా వినియోగించడం వల్ల భూసార సంతులనం దెబ్బతిని, దీర్ఘకాలంలో పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువులు, సూక్ష్మ పోషకాలు, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
భూసార పరిరక్షణే లక్ష్యంగా రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువుల వినియోగాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పంట అవసరాలకు అనుగుణంగా ఎరువులు వాడటం ద్వారా మాత్రమే మెరుగైన దిగుబడులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు మరింత చురుకుగా పనిచేసి రైతులకు ఎరువుల సరైన వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు క్షేత్రస్థాయిలో శాస్త్రీయ మార్గదర్శకత్వం అందించడం అత్యంత అవసరమని తెలిపారు.
ఎరువుల దుకాణదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవసరానికి మించి ఎరువులు విక్రయించరాదని హెచ్చరించారు. రైతులను ఇతర అనవసర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వానాకాలం–2026 సీజన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమతుల్య ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి రఘునాథ్ రావు, మార్క్‌ఫెడ్ డీఎం తమీన తదితరులు పాల్గొన్నారు.