Take a fresh look at your lifestyle.

అటవీ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి – ఈకో సెన్సిటివ్ జోన్ల రక్షణకు కమిటీ ఏర్పాటు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లాలో అటవీ భూముల సంరక్షణ, ఈకో సెన్సిటివ్ జోన్ల రక్షణ, చెంచు గిరిజనుల పునరావాస గ్రామాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.

మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్రతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అక్రమ ఆక్రమణలను నివారించే విధానాలు, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

కలెక్టర్ మాట్లాడుతూ అటవీ భూముల సర్వే, సరిహద్దుల గుర్తింపు, భూముల రికార్డుల నవీకరణపై రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అటవీ వనరుల సంరక్షణలో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని తెలిపారు. అక్రమంగా చెట్ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఈకో సెన్సిటివ్ జోన్లలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అక్రమ నిర్మాణాలు, తవ్వకాలు, చెట్ల నరికివేత వంటి చర్యలను కట్టడి చేయాలని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈకో సెన్సిటివ్ మరియు సైలెంట్ జోన్ల ఏర్పాటుపై నివేదికలు సమర్పించేందుకు పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

అటవీ ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

అదేవిధంగా నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి తరలించే నాలుగు గ్రామాల ప్రజల పునరావాసానికి పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో ఏర్పాటు చేయనున్న పునరావాస గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్డీఓలు, అటవీ అధికారులు, ఎమ్మార్వోలు ప్రాంతాన్ని సందర్శించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు.

పునరావాస గ్రామాల్లో పాఠశాల, అంగన్వాడి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేలా ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో పీడీ డీఆర్‌డీఏ చిన్న ఓబులేసు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ విజయ్ కుమార్, మిషన్ భగీరథ అధికారులు, కొల్లాపూర్, అచ్చంపేట ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.