ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించాలి – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలి. -కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక
ముద్ర, నారాయణ పేట :
జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు.

వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఇస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధ్వర్యలో రైతు వారంలో భాగంగా ఉద్యాన పంటల సాగు – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుదల పై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఖమ్మం లో రైతులు ఎక్కువగా ఆయిల్ ఫామ్ తోటలను చేస్తారని, తాను అక్కడ విధులు నిర్వహించానని చెప్పారు. మన జిల్లా లో అసక్తి గల రైతులను ఖమ్మం తీసుకువెళ్ళి ఆయిల్ ఫామ్ సాగు ను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయించాలని తెలిపారు. ఆయిల్ ఫామ్, ఇతర పంటలను చిన్న సన్న కారు రైతులు కూడా పండించాలని ఆమె కోరారు. ప్రస్తుతం జిల్లాలో 206 ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటల సాగు చేస్తున్నారని, 10 వేల ఎకరాల్లో సాగు చేస్తే మన జిల్లాలోనే ఫ్యాక్టరీ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరడానికి అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదా శివారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.