ముద్ర కూకట్‌పల్లి :
మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయం వద్ద శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, ఈటెల రాజేందర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
వడ్డేపల్లి రాజేశ్వరరావు
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఈటెల రాజేందర్ ప్రజల పట్ల అంకితభావం కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. “బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడుతూ వారి ఆశలకి దీపస్తంభంలా నిలుస్తున్న నాయకుడు ఈటెల. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధికి, ప్రజాసేవకు అంకితమై భారతదేశ ప్రగతిలో తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. ఆయన నాయకత్వం నేటి యువతకు స్ఫూర్తిదాయకం,” అని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఈటెల రాజేందర్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంచి మహేందర్ యాదవ్, ప్రీతం రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, వరలక్ష్మి, సులోచనతో పాటు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.