ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
అగ్నిమాపక సేవా దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక అమరవీరులకు జిల్లా అగ్నిమాపక శాఖ ఘనంగా నివాళులు అర్పించింది. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించబడే అగ్నిమాపక వారోత్సవాలను ఎమ్మెల్యే కె. రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కె. దామోదర్ రెడ్డి పోస్టర్లను విడుదల చేసి ప్రారంభించారు.
వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక యంత్రాల వినియోగంపై ప్రజలకు ప్రత్యక్ష శిక్షణ అందిస్తూ, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను ఎలా ఉపయోగించాలో వివరంగా చూపిస్తున్నారు.
వంటగది భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఎల్‌పీజీ గ్యాస్ లీకేజీ గుర్తింపు మరియు ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. బహుళ అంతస్థుల భవనాల్లో అగ్నిమాపక భద్రతా చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడే మార్గాలపై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అగ్నిమాపక భద్రతపై నోట్స్ మేకింగ్ విధానంలో కీలక అంశాలను బోధిస్తున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి పి. గిరిధర్ రెడ్డి నేతృత్వంలో ఈ వారం రోజుల పాటు హాస్పిటల్స్, థియేటర్లు, పరిశ్రమలలో తనిఖీలు నిర్వహిస్తూ అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి.