Take a fresh look at your lifestyle.

బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు

 

– మానకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం

– పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు

బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టం తన ఉక్కుపాదాన్ని మోపుతుందని, పిల్లల రక్షణకు చట్టమే ఒక అజేయమైన కవచమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. బుధవారం మానకొండూరులోని పీయంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ బాల్య వివాహాలనే మహమ్మారి ఆడపిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తోందనన్నారం. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ద్వారా ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. కేవలం వివాహాలే కాకుండా సమాజంలో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టే ‘పోక్సో’ చట్టంపై విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా నిర్మూలనతో పాటు నేటి తరాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల ముప్పు నుండి ఎలా బయటపడాలో సోదాహరణంగా వివరించారు. చట్టం అందరికీ సమానమని పేదరికంతో న్యాయానికి దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో న్యాయ సేవా అధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని వారు కోరారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్, ప్యానల్ అడ్వకేట్ లు యస్.వి.ఆర్. కృష్ణ, బలుసుల శాంతి కుమార్, తిరుమణి అశ్విని, జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది కొత్తకొండ శంకర్, న్యాయవాది దుంపేటి శ్రీనివాస్ లు తమ ప్రసంగాలతో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులు దీపారాణి, రమేష్, శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. ఈ సదస్సులో విద్యార్థులు న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సదస్సు విద్యార్థుల్లో సరికొత్త చైతన్యాన్ని నింపిందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.