- కర్నాటక తరహాలో అమలు చేయాలని నిర్ణయం.
- 17వ తేదీ వరకు సర్వేయర్ల నియామక దరఖాస్తుల స్వీకరణ.
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో:రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా భూ లావాదేవీలను సమర్దవంతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.దీనికి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో విజయవంతమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు.ఇందులో భాగంగా ఐదు వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు.అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణా అకాడమీలో శిక్షణ ఇస్తామని అన్నారు.కర్ణాటక రాష్ట్రంలో అమలు అవుతున్న లైసెన్స్‌డ్ సర్వే విధానంపై ఇటీవల సర్వే విభాగానికి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం జరిగిందని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.కర్ణాటక రాష్ట్రప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ పథకం 1999 లో కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ చట్టంలో చేసిన సవరణలతో ప్రారంభమై, 2005-2006 నుంచి అమలులోకి వచ్చిందని ఈపథకం ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌కు ముందు మ్యూటేషన్ స్కెచ్ (PMS) తయారుచేయబడుతుందన్నారు.ప్రీ-రిజిస్ట్రేషన్ స్కెచ్‌తో కొనుగోలు చేయబోయే భూమి గురించి విస్తీర్ణం టైటిల్ వంటి స్పష్టమైన భూసరిహద్దు వివరాలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు గురువారం మంత్రి వివరించారు.
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 6000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు ,4000 మందిప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తున్నారని ఒక్కో లైసెన్స్‌డ్ సర్వేయర్ కు నెలకు సగటున 23 దరఖాస్తులు వస్తాయన్నారు.దీని ద్వారా అతనికి నెలకు రూ 25 వేల నుండి రూ. 30 వేల ఆదాయం వస్తుందని తెలిపారు.లైసెన్స్‌డ్ సర్వేయర్లు నిర్వహించి, రిజిస్ట్రేషన్ కు ముందు స్కెచ్ తయారుచేసి పోర్టల్లో అప్ లోడ్ చేస్తారు.వీరిపనులను ప్రభుత్వసర్వేయర్లు పరిశీలించి, సంబంధిత అధికారి (AD, S&LR) ఆమోదిస్తారు.ఈ పథకంద్వారా భూలావాదేవీలు మరింత సమర్థవంతంగా,శాస్త్రీయంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాష్ట్రంలో శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.ఈ భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జత పరచడం తప్పనిసరి చేసిన నేపధ్యంలో ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధానం అమలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.రాష్ట్రంలో ఆయా మండలాల్లో భూలావాదేవీలు, భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలని అధికారులకు సూచించారు.కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ల క్రితం నియమితులైన సర్వేయర్లు కొనసాగుతునేఉన్నారని ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంభించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
Prev Post
Next Post