ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి రైతులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా
ముద్ర ప్రతినిధి, మెదక్:
మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో అధిక సాంద్రత సాగుపై కిసాన్ మేళా నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు.

రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, పంటల నిర్వహణ విధానాలు, యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన వీక్షించి రైతులతో ముచ్చటించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలు, శాస్త్రీయ సూచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి పద్ధతులను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది రైతులు పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ.. రైతు లేనిదే మునుగడ లేదన్నారు. రైతులు నష్టాలకు ఓర్చి భూమిని నమ్ముకొని ఆశలతో బతుకుతారని, వారిని ఎంతైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సమస్యలను కూడా అధికారులు రైతులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నల్కర్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ , జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, స్థానిక సర్పంచ్లు ,రైతులు పాల్గొన్నారు.