Take a fresh look at your lifestyle.

ఢీ అంటే ఢీ మంత్రి వర్సెస్ ఎంపీ

– మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ మధ్య ప్రోటోకాల్ వార్
– అమరచింత పెద్ద చెరువు సుందరరీకరణ పనుల్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం
– అమృత్ పథకం లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చెరువు పనులు అంటున్న అరుణ
– జనవరి 23 న చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శ్రీహరి భూమి పూజ
– ఎంపీ అరుణ కు సమాచారం ఇవ్వని మంత్రి శ్రీహరి.. ఎంపీ లేకుండానే భూమి పూజ
– మంత్రి ప్రోటోకాల్ పాటించకుండా నిర్మాణ పనులు ఎలా ప్రారంభిస్తారని ఎంపీ డీకే అరుణ ఆగ్రహం
– ఈనెల 10 న అదే చెరువు పనులకు భూమి పూజ చేసిన ఎంపీ అరుణ
– అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
– కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం.. తోపులట
– కేంద్ర నిధులు ఎన్ని తెచ్చారో బహిరంగ చర్చకు అరుణ సిద్ధమా అంటూ మంత్రి సవాల్
– జిల్లా లో హాట్ టాపిక్ గా మారిన మంత్రి, ఎంపీ వాగ్వాదం
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ పథకం లో భాగంగా ఈ చెరువు సుందరీకరణ పనులకు రూ. 3.5 కోట్లు మంజూరయ్యాయని బీజేపీ నేతలవాదన. ఈ పనుల ప్రారంభానికి ఈ ఏడాది జనవరి 23 న మక్తల్ ఎమ్మెల్యే,రాష్ట్ర పశు సంవర్థక, క్రీడా శాఖా మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. ఈ పనుల ప్రారంభం సందర్బంగా ఎంపీ డీకే అరుణ కు మంత్రి సమాచారం ఇవ్వలేదు. ఎంపీ కి సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీనాయకులు అప్పట్లో మంత్రి పై మండిపడ్డారు.

కేంద్ర నిధులతో చేపడుతున్న చెరువు పనులను బీజేపీ కి చెందిన ఎంపీ డీకే అరుణ ఎందుకు సమాచారం ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆగ్రహం చెందారు.మంత్రి స్వలాభం కోసం ప్రోటోకాల్ పాటించడం లేదని, ఇది తనకు అవమానం గా భావించిన అరుణ ఈ నెల 10 న అమరచింత పెద్ద చెరువు వద్దకు వెళ్లి సుందరీకరణ పనులకు భూమి పూజ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలో చెరువు వద్దకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లి ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఎంపీ డీకే అరుణ తో గొడవకు దిగారు. ఇది వరికే మంత్రి శ్రీహరి భూమి పూజ చేశారని, మళ్ళీ మీరు చేయడం సమంజసం కాదని అరుణ ను అడ్డుకున్నారు. అక్కడకు భారీ గా చేరుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.మహిళా ఎంపీ అని చూడకుండా తనపై దాడి చేసేందుకు మంత్రి శ్రీహరి రౌడీ లను పంపారని డీకే అరుణ ఆరోపిస్తున్నారు. ప్రజాభివృద్ధి కోసం పాటు పడే సమయంలో గతంలో రాయలసీమ రౌడీ లకే భయపడలేదనే అరుణ చేసిన కామెంట్ తో కాంగ్రెస్ కార్యకర్తల కు మరింత ఆగ్రహం తెప్పించింది. మమ్మల్ని రౌడీలతో పోలుస్తారా అంటూ డీకే అరుణ పై మంత్రి శ్రీహరి మండిపడుతున్నారు.ఈ మక్తల్ నియోజకవర్గం నుంచి గతం లో కాంగ్రెస్ హయాంలో మంత్రి గా పని చేసిన చిట్టెం నర్సిరెడ్డి ( డీకే అరుణ తండ్రి ),టీడీపీ హయాంలో లో మంత్రి గా ఉన్న ఎల్లారెడ్డి ఎన్నడూ ప్రోటోకాల్ విస్మరించలేదని, ఇదే కాకుండా వాళ్లు రౌడీయిజం చేయలేదని, ఏనాడు నియోజకవర్గం లో ఘర్షణ వాతావరణం కల్పించలేదని డీకే అరుణ అంటున్నారు. శ్రీహరి మంత్రి అయిన తరువాత ఈ నియోజకవర్గం లో ప్రోటోకాల్ పాటించడం లేదని, ఇది పద్ధతి కాదని నిలదీస్తే రౌడీ లతో బయపెడుతున్నారని అరుణ ఆరోపించారు.అరుణ మాటలకు మంత్రి శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ లోకసభ నియోజకవర్గానికి ఎన్ని తెచ్చారో ఎంపీ అరుణ చెప్పాలని, దీని పై ఎక్కడైనా తాను చర్చకు సిద్దమని మంత్రి శ్రీహరి బీజేపీ ఎంపీ అరుణ కు సవాల్ విసిరారు. చర్చ కు స్థలం మీరు నిర్ణయించినా సరే… ఒకవేళ మీరు నిర్ణయించ కుంటే మేము నిర్ణయం తీసుకుంటామనని.. దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.పైసా నిధులు కేంద్రం నుంచి రాబట్టని ఎంపీకి అభివృద్ధి పై మాట్లాడే హక్కులేదని మంత్రి మండిపడుతున్నారు. ఆమె ఎక్కడ కు వెళ్లినా ఘర్షణ వాతావరణం సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని మంత్రి విమర్శలు చేస్తున్నారు.గొడవలు సృష్టించడం మా నైజం కాదని,కానీ డీకే అరుణ కు గొడవలు సృష్టించడమే అలవాటుగా పెట్టుకున్నారని మంత్రి ఆరోపించారు.రౌడీ యిజం ఎవరు చేస్తారో ఉమ్మడి జిల్లా ప్రజలకు అంతా తెలుసని,నియోజకవర్గం అభివృద్ధి పై ప్రేమ ఉంటే ఇకనైనా కేంద్రం నుంచి నిధులు తెవాలని డీకే అరుణ కు మంత్రి శ్రీహరి హితవు పలికారు.అమరచింత, ఆత్మకూర్ ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణం పనులను కూడా అరుణ అడ్డుకుంటుందని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం చేస్తున్న బ్రిడ్జి పనులను కూడా ఆమె అడ్డుకుంటుందన్నారు. మంత్రి చేస్తున్న అభివృద్ధి ని అడ్డుకుంటున్నానని ఆయన భావిస్తే ఆత్మకూర్ చౌరస్తా లో అభివృద్ధి పై చర్చ కు సిద్దమని, అందుకు మంత్రి సిద్ధంగా ఉండాలని అరుణ సవాల్ చేశారు. సరియైన ప్రాంతం లో బ్రిడ్జి నిర్మాణం పనులు చేస్తే ఎందుకు అడ్డుకుంటామని ఆమె ప్రశ్నిస్తున్నారు.మంత్రి బెదిరిస్తే బీజేపీ కార్యకర్తలు బయపడరని, రౌడీ యిజం పక్కన పెట్టి అభివృద్ధి పై దృష్టి పెట్టాలని ఎంపీ డీకే అరుణ హితవు పలికారు.ఈ చెరువు సుందరీకరణ పనుల్లో, బ్రిడ్జి నిర్మాణం పనుల్లో ఈ ఇద్దరి నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు.ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారా స్థాయి కి చేరింది. ఈ లోకసభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా ఇప్పటి వరకు కేంద్ర నిధులు ఒక్క రూపాయి కేటాయించలేదనే భావనలో ఈ ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. అన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఈ పనుల్లో పాల్గొనేందుకు ఎంపీ కి ఏమి అవసరం ఉందని, అందుకే ఆమెకు ప్రోటోకాల్ పాటించవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ మధ్య మాటల యుద్ధం చర్చ నియాంశమైంది.మక్తల్ నియోజకవర్గం లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నాయకుల మధ్య రగడ ఎంతవరకు సాగుతుందో వేచిచూడాలి.

అరుణ సవాల్ కు సిద్ధం
– మంత్రి వాకిటి శ్రీహరి
………………………………………
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కి కేంద్రం ఎన్ని నిదులిచ్చిందో… రాష్ట్రం ఎన్ని ఇచ్చిందో అనే అంశం పై ఎంపీ డీకే అరుణ చేసిన సవాల్ కు చర్చించేందుకు సిద్దమని రాష్ట్ర పశు సంవర్థక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. అమరచింత పెద్ద చెరువు సుందనీకరణ కోసం తాను భూమి పూజ చేస్తే మళ్ళీ అదే పనికి ఎంపీ డీకే అరుణ భూమి పూజ చేస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని మంత్రి తెలిపారు. మేము రౌడీ యిజం చేయమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి తెలంగాణ రాష్ట్రం వరకు రౌడీ యిజం చేసిందెవరో ప్రజలకు తెలుసని మంత్రి పేర్కొన్నారు.ఇప్పటికైనా అభివృద్ధి పై అరుణ తో చర్చ కు సిద్దమన్నారు. ఆత్మకూర్ లో చర్చిద్దామా…. లేక అమరచింత లో చర్చిద్దామా స్థలం చెప్పండని మంత్రి శ్రీహరి బీజేపీ ఎంపీ అరుణ కు సవాల్ చేశారు.
…………………….

Leave A Reply

Your email address will not be published.