Take a fresh look at your lifestyle.

మరి కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర,………………..గెలుపేవరిదో

 నేడు మున్సిపోల్ ఓట్ల లెక్కింపు

జిల్లాలో 6 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు ఆయా కేంద్రాల్లోనే కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు

126 వార్డుల్లో పోలైన 1,39,044 ఓట్ల లెక్కింపు కై 63 టేబుళ్ల ఏర్పాటు

ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా భారీ భద్రతా ఏర్పాట్లు

(ముద్ర ప్ర‌తినిధి, ఉమ్మ‌డి రంగారెడ్డిజిల్లా):

మున్సిప‌ల్ ఎన్నిక‌లు తుది ఘ‌ట్టానికి చేరుకున్నాయి. మంగ‌ళ‌వారం పోలింగ్ ప్ర‌క్రియ ముగియ‌డంతో షెడ్యూల్ ప్ర‌కారం శుక్ర‌వారం ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ద‌మైంది. దీంతో మ‌రో కొన్ని గంట‌ల్లో.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా జిల్లాలో ఈసారి మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌, బీజేపీల మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది. దీంతో పుర పోరులో విజ‌యం ఏయే రాజ‌కీయ పార్టీల‌ను వ‌రిస్తుందోన‌న్నది స‌ర్వ‌త్రా తీవ్ర ఉత్కంఠ‌ను రేపుతోంది. ఈ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స‌హ‌జంగానే ముందంజ‌లో ఉంటుంద‌ని అనేక స‌ర్వేలు వెల్ల‌డించాయి. అయితే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన బీఆర్ ఎస్‌తో పాటు బీజేపీలు సైతం త‌మ‌కే ఎక్కువ విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌ని ధీమాతో ఉన్నాయి. ఎవ‌రి ఆశ‌లు ఎలా ఉన్న.. మున్సిపోల్స్‌లో అదృష్టం ఎవ‌రిని వ‌రిస్తుందో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నానికి తేలిపోనుంది.

6 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపుకు 265 మంది సిబ్బంది

ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల మేర‌కు జిల్లాలో ఎన్నిక‌లు జ‌రిగిన 6 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపుకు జిల్లా ఎన్నిక‌ల యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేప‌ట్టింది. ఈమేర‌కు ఆయా మున్సిపాలిటీల ప‌రిధిలో పోలైన ఓట్ల ను క‌లిగిఉన్న బ్యాలెట్ బాక్సుల‌ను ముందుగానే ఎంపిక‌చేసిన‌ ఓట్ల లెక్కింపు కేంద్రాల‌కు త‌ర‌లించి భ‌ద్ర‌ప‌ర్చింది. దీంతో శుక్ర‌వారం ఆయా మున్సిపాలిటీల్లో స‌ర్వం సిద్ధం చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జ‌రుగ‌నుంది. ఇందుకోసం 6 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపుకు అవ‌స‌ర‌మైన 265 మంది అధికారుల‌ను, సిబ్బందిని నియ‌మించారు. ఇందులో 64 మంది ఓట్ల లెక్కింపు ప‌ర్య‌వేక్షక అధికారులు ఉన్నారు. వీరికి అద‌నంగా మ‌రో 27 మంది అద‌న‌పు ఓట్ల లెక్కింపు ప‌ర్య‌వేక్షక అధికారులను సిద్ధంగా ఉంచారు. అలాగే 128 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటుగా అద‌నంగా మ‌రో 46 మందిని ఓట్ల లెక్కింపు కోసం అందుబాటులో ఉంచారు. ఓట్ల లెక్కింపు విష‌యానికొస్తే.. ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీలో 5 మంది ప‌ర్య‌వేక్ష‌కాధికారును, 10 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. చేవెళ్ల‌లో 9 మంది ప‌ర్య‌వేక్ష‌కాధికారును, 18 మంది కౌంటింగ్ సిబ్బందిని నియ‌మించారు. ఇబ్ర‌హీంప‌ట్నంలో 12 మంది ప‌ర్య‌వేక్ష‌కాధికారును, 24 మంది కౌంటింగ్ సిబ్బందిని, మొయినాబాద్‌లో 14 మంది ప‌ర్య‌వేక్ష‌కాధికారును, 28 మంది కౌంటింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. షాద్‌న‌గ‌ర్‌లో 14 మంది ప‌ర్య‌వేక్ష‌కాధికారును,28 మంది కౌంటింగ్ సిబ్బందిని, శంక‌ర్‌ప‌ల్లిలో 10 మంది ప‌ర్య‌వేక్ష‌కాధికారును, 20 మంది కౌంటింగ్ సిబ్బందిని నియ‌మించారు. ఆయా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్త‌కుండా అద‌నంగా 27 మంది ప‌ర్య‌వేక్ష‌కాధికారును,46 మంది కౌంటింగ్ సిబ్బందిని జిల్లా ఎన్నిక‌ల యంత్రాంగం అందుబాటులో ఉంచడం జ‌రిగింది.

63 టేబుళ్ల‌పై 1,39,044 ఓట్ల లెక్కింపు

జిల్లాలో (6) ఆమ‌న్‌గ‌ల్‌, ఇబ్ర‌హీంప‌ట్నం, మొయినాబాద్‌, శంక‌ర్‌ప‌ల్లి, షాద్‌న‌గ‌ర్‌, చేవెళ్ల మున్సిపాలిటీల్లో మంగ‌ళ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో మొత్తం 1,39,044 ఓట్లు న‌మోద‌య్యాయి. వీటిని లెక్కించ‌డానికి ఆయా మున్సిపాలిటీల ప‌రిధిలో 6 కౌంటింగ్ కేంద్రాల‌ను సిద్ధం చేశారు. ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును స్థానిక బ్రిలియంట్ గ్రామ‌ర్ స్కూల్‌లో చేప‌డ‌తారు. చేవెళ్ల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును స్థానిక ఫ‌రా ఇంజ‌నీరింగ్ కాలేజ్‌లో, ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును షేరిగూడ శ్రీ ఇందూ కాలేజ్‌లో చేప‌డ‌తారు. మొయినాబాద్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును ఎంఏకే ఫార్మ‌సీ కాలేజ్‌లో, షాద్‌న‌గ‌ర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును స్థానిక మినీ స్టేడియంలో, శంక‌ర్‌ప‌ల్లి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును స్థానిక మున్సిప‌ల్ ఆడిటోరియంలో చేడ‌ప‌తారు. ఈ 6 కేంద్రాల‌లో గుర్తించిన 7 గ‌దుల‌లో అత్యంత భ‌ద్ర‌తా ఏర్పాట్ల మ‌ధ్య‌న టేబుల్ల వారీగా ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఇందుకోసం ఆరు మున్సిపాలిటీల ప‌రిధిలో ఎన్నిక‌లు జ‌రిగిన 126 వార్డుల్లో పోలైన 1,39,044 ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 63 టేబుల్ల‌ను జిల్లా ఎన్నిక‌ల యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఆమన్ గల్ మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపు కోసం 5 టేబుళ్లను, చేవెళ్ల మున్సిపాలిటీలో 18 వార్డుల ఓట్ల కౌంటింగ్ కోసం 9 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డుల ఓట్ల లెక్కింపుకు 12 టేబుళ్లను, మొయినాబాద్ మున్సిపాలిటీ లో 26 వార్డుల ఓట్ల లెక్కింపుకు 13 టేబుళ్లను సిద్ధం చేశారు. షాద్నగర్ మున్సిపాలిటీ లో 28 వార్డుల ఓట్ల లెక్కింపు కు 14 టేబుళ్లను, శంకర్ పల్లి మున్సిపాలిటీ లో 15 వార్డుల ఓట్ల లెక్కింపు కు 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
******

Leave A Reply

Your email address will not be published.