మహదేవపూర్, ముద్ర:
పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మే 21 నుండి జూన్ 1 తేది వరకు జరగబోయే సరస్వతి పుష్కరాలకు భక్తులకు ఇబ్బందుల తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ, స్నాన ఘట్టాల వద్ద రక్షణ, దేవాలయం వద్ద భద్రత చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మూడు ప్రధాన రూట్ల నుండి వచ్చే వాహనాలకు 250 ఎకరాలలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉన్నందున 2500 పోలీసులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. భూపాలపల్లి నుండి కాళేశ్వరం వరకు ఉన్న జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులు మరియు వివిఐపిలు మాత్రమే ప్రయాణిస్తారని, వరంగల్ జిల్లా మీదుగా కాళేశ్వరం వెళ్లే ప్రైవేట్ వాహనాలు రుద్రారం నుండి కొయ్యూరు, గంగారం కూడలి మీదుగా అన్నారం, మద్దులపల్లి మీదుగా ఆదిముక్తేశ్వర టెంపుల్ వద్ద పార్కింగ్ స్థలాన్ని చేరుకుంటాయి. మంచిర్యాల మీదుగా సిరువంచ ద్వారా కాళేశ్వరం చేరుకునే ఇతర రాష్ట్రాల భక్తులకు కన్నెపల్లి వద్ద పార్కింగ్ స్థలం కేటాయించినట్లు తెలిపారు. అక్కడి నుండి కాళేశ్వరం దేవాలయం వరకు షటిల్ బస్సులు, ఆటోల సౌకర్యం కల్పించబడుతుంది. మహాదేవపూర్ నుండి కాళేశ్వరం మధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తితే వాహనాలను బీరాసాగరు ద్వారా మహాదేవపూర్ పంపించబడతాయి. ములుగు నుండి చింతకాని మీదుగా కాటారం మండలం చేరుకునే ప్రైవేట్ వాహనాలను గంగారం కూడలికి మళ్లిస్తారు. తిరిగి వెళ్లే వాహనాలన్నీ జాతీయ రహదారి మీదుగా తిరుగు ప్రయాణం అవుతాయి. ఘాట్ల వద్ద భక్తులు స్నానాలు చేసే సమయంలో పోలీసులు, రక్షణ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రధాన దేవాలయం వద్ద రద్దీ కాకుండా బారికేట్లు ఏర్పాటు చేయటంతో పాటు మధ్యలో రెస్ట్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్కింగ్ ఏరియాల్లో వర్షం పడినా వాహనాలు దిగబడకుండా పార్కింగ్ స్థలాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వాహనాలపై వెళ్లడానికి అనుమతి ఇస్తామని తెలిపారు. సిఐ వెంకటేశ్వర్లు మ్యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను వివరించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పి నరేష్ కుమార్, డి.ఎస్.పి సూర్యనారాయణ, సానిక ఎస్ ఐ తమాషారెడ్డితో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.