ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బాసర ఐఐఐటీలో నైపుణ్యాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.
బాసర ఐఐఐటి క్యాంపస్‌ను ఆయన సందర్శించారు. యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి సంబంధించిన విభాగాలు, విద్యార్థుల సంఖ్య, విద్యా విధానం, అధ్యాపకుల వివరాలను తెలుసుకొన్నారు.
అనంతరం మాట్లాడుతూ క్యాంపస్ విద్యార్థులను ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీర్చిదిద్దాలని సూచించారు. విద్యా బోధనలో ఆధునిక, సులభతర పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధన సాగించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో వర్సిటీ ఉపకులపతి గోవర్ధన్, డిఆర్డిఓ విజయలక్ష్మి, తహసీల్దార్ పవన్ చంద్ర, యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.