బోథ్, ముద్ర:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ -ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు అన్నారు. గురువారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూర్ పరిధిలోని ఆదిలాబాద్ రూరల్ మండలం బూర్కి, మాంగ్లి గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమ, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఆదివాసి గిరిజన ప్రాంతాలలో విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తూ గిరిజన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించడంతో పాటు, మారుమూల ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన గిరిజనులకు ప్రధానమంత్రి జన్ మన్, జుగా పథకాలను అమలు చేయడంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గిరిజన గ్రామాలలో త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, గ్రామాలలోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు శుభ్రంగా ఉండేలా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గిరిజన గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.