స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహానేత శ్రీపాదరావు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళి
శ్రీపాద రావు గారి సేవలు మరువలేనివి
శ్రీపాద రావు 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్..
ముద్ర, ధర్మపురి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా సేవలందిస్తూ ఆ పదవికి దేశవ్యాప్తంగా గౌరవం తీసుకువచ్చిన గొప్ప నాయకుడు స్వర్గీయ శ్రీపాదరావు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ధర్మపురిలో జరిగిన శ్రీపాదరావు 89వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీపాదరావు క్రమంగా ఎదిగి శాసనసభ స్పీకర్‌గా ఉన్నత స్థానాన్ని అధిరోహించారని గుర్తుచేశారు. స్పీకర్‌గా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఉన్న కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచి, వారి సమస్యల్లో భాగస్వామ్యమైన నాయకుడిగా శ్రీపాదరావు పేరు నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి అభిప్రాయపడ్డారు.
అలాగే, తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాల్లో సత్తా చాటుతున్నారని కొనియాడారు. తనలాంటి సామాన్య కార్యకర్తకు క్యాబినెట్ స్థాయి అవకాశం కల్పించిన ఘనత శ్రీధర్ బాబుదేనని అన్నారు. ధర్మపురి ప్రాంతంతో శ్రీపాదరావు, శ్రీధర్ బాబులకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్, మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారం రామన్నతో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.