ముద్ర మల్కాజిగిరి :
మల్కాజ్‌గిరి నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలను వైద్యులు వివరించగా, వాటి పరిష్కారానికి తాను కట్టుబడి పనిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నర్సింగ్, సపోర్టింగ్, టెక్నికల్, పారామెడికల్ సిబ్బందిని నియమించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే అవసరమైన కంప్యూటర్లు, ఫర్నిచర్ వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
ప్రస్తుతం సిహెచ్సి మల్కాజ్‌గిరి ఆసుపత్రి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు అనుబంధంగా పనిచేస్తున్న నేపథ్యంలో, త్వరలో పూర్తికానున్న టి ఐ ఎం ఎస్ ఆసుపత్రికి సిబ్బంది మార్పిడి జరిగితే సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
రోజుకు సుమారు 800 మంది ఔట్‌పేషెంట్లు వస్తుండటంతో అభా కార్డుల నమోదు పెంపు కోసం అదనపు సిబ్బంది అవసరమని పేర్కొన్నారు. మెడికల్ విద్యార్థులను క్లినికల్ సేవల్లో భాగస్వామ్యం చేయాలని, ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్‌ను అమలు చేయాలని సూచించారు.
ఆసుపత్రి సమీపంలోని ప్రభుత్వ భూమిపై ఎమ్మార్వోతో కలిసి పరిశీలన జరిపి, అది ఆసుపత్రికి చెందినదైతే బోర్‌వెల్, ట్యాంక్ సంప్ నిర్మించాలని ఆదేశించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను సి ఎస్ ఆర్ కింద పరిగణించాలని చెప్పారు.
కోవిడ్ సమయంలో కేటాయించిన వార్డును హాల్‌గా వినియోగించుకోవాలని, లిఫ్ట్‌ను నాలుగో అంతస్తు వరకు విస్తరించాలని సూచించారు. అలాగే కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేసి, ప్రస్తుత లిఫ్ట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని తెలిపారు. తాగునీటి ప్రెజర్ పెంపు, రోగులు మరియు సందర్శకుల కోసం బెంచీలు ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంకా కార్ పార్కింగ్ సదుపాయం కోసం సమీప ప్రభుత్వ పాఠశాల స్థల వినియోగంపై అనుమతులు తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ, అంబులెన్స్, పోలీస్ అవుట్‌పోస్ట్ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాల్లో కుక్కల బెడద నివారణ, చలివేంద్రం ఏర్పాటు వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఉమా గౌరీ, మల్కాజ్‌గిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధతో పాటు పలువురు వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆసుపత్రి సమగ్ర అభివృద్ధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు