Take a fresh look at your lifestyle.

స్వర్ణగిరిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం, చక్రస్నానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో ‘అష్టోత్తర శతకలశాభిషేకం’ నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ 108 పవిత్ర కలశాలతో స్వామి వారికి జరిగిన ఈ అభిషేక సేవను భక్తులు కనులారా వీక్షించి తరించారు. బ్రహ్మోత్సవాల విశిష్ట ఘట్టమైన ‘సుదర్శన చక్రస్నానం’ జల నారాయణుడి సన్నిధిలో అత్యంత వేడుకగా జరిగింది. పవిత్ర జలాల్లో సుదర్శన స్వామివారికి శాస్త్రోక్తంగా పుణ్యస్నానం ఆచరింపజేశారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చక పండితులు మరియు అశేష భక్తజన సందోహం పాల్గొని పునీతులయ్యారు. గోవింద నామస్మరణతో మారుమోగుతున్న స్వర్ణగిరి క్షేత్రంలో, భక్తుల కోలాహలం మధ్య ఈ బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత దిగ్విజయంగా సాగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.