తాండూర్ జిల్లా దవఖానాలో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేసేందుకు త్వరలో నిధులు
ముద్ర, తాండూర్ :
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్య సేవలు, , వైద్య సిబ్బంది హాజరును పరిశీలించారు.అంతకు ముందు ఇప్పటి వరకు జిల్లా ఆసుపత్రి
ఇంచార్జి సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ వినయ్ వైద్య సిబ్బంది ని వేధింపులకు గురి చేసిన విషయమై జిల్లా ఆస్పత్రిలో కోఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్ తో వివరాలు ఆరా తీశారు. వైద్యులు క్రమశిక్షణతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డ్రైనేజ్, మౌలిక వసతుల సమస్యలను సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, అందుకు కలెక్టర్ స్పందిస్తూ వారంలోగా ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై నివేదికలు తెప్పించుకోవాలని, తక్షణమే ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. తాండూర్ మండలం గౌతాపూర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వం చేస్తేనే అభివృద్ధి కాదని ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు అయినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.