ఎంత బాగుండూ….!!
ఏడాదికోసారి ఎన్నికల పండుగలు వస్తే ఎంత బాగుండూ….!!
పగలు ప్రచారం ముగిసింది..!
రాత్రి పంపిణీ మిగిలింది…!!
పెరిగిన ఓటర్ల గిరాకి…!*వస్తున్నవి తాయిలాలు ప్రతి ఇంటికి…!
ఓటర్లకు విందు… భలే పసందు…!!!
గెట్ టుగెదర్…! సుక్కకు, ముక్కకు రావోయి బ్రదర్…!!
కులాలు, మతాల వారిగా సమీకరణలు…! పొరపాట్లు, తప్పిదాల సవరణలు…!!!
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా… నీ ఓటు నాకే వేస్తానని…
మూగబోయిన మైకులు…! మనీ, మద్యం పంపిణీకి బయలుదేరిన బైకులు…!!!
ఖాళీ అయిన వైన్స్… వచ్చిన విందు చాన్స్…!!
తాగరా అన్న.. తాగి ఊగరా అన్న…. తగ్గేదేలే అంటున్న ఓటర్లు…!
చెబితే వింటుండ్రు… ఓటు మీకే వేస్తామని అంటుండ్రు…!
ఎవరైతే బెటర్… ఆల్రెడీ డిసైడెడ్ ఓటర్…!!!
✍️ డాక్టర్ కృష్ణ బంటు, స్వతంత్ర పాత్రికేయులు
తెలంగాణ సమాజమంతా పండుగ సంతోషాలను మైమరపిస్తూ ఎన్నికల పండుగలు జరుపుకుంటున్నారు. ఐదేళ్లకి ఒకసారి ఎన్నికల పండుగలు జరుపుకునే ఓటర్లు ఏడాదికోసారి ఎన్నికలు వస్తే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు. రాష్ట్రంలోని ఏ వీధిలో చూసినా, ఏ వాడను పరిశీలించినా, ఏ ప్రాంతంలో పర్యటించినా ఆయా ప్రాంతాల ప్రజలందరూ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అప్పటికప్పుడు తెచ్చి ముఖాలపై పెట్టుకున్న నవ్వులు, ఒల్కపోస్తున్న ఆప్యాయతలు, పోటీపడి అన్ని పార్టీల పోటీ చేసిన అభ్యర్థులు రోజు ఇంటి వద్ద హాజరు వేసినట్లుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వస్తుండడంతో ఓటర్లు తమ విలువ ఒక్కసారిగా పెరిగినట్టు గాలిలో తేలుతున్నారు. ప్రతిరోజు పండుగ రోజే అన్నట్టుగా ప్రస్తుతం తెలంగాణలోని ఓటర్ల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తాగడానికి కావలసినంత మందు దొరుకుతుంది, చికెన్, మటన్ పంపిణీ చేస్తున్నారు, ఖర్చులకు డబ్బు అందిస్తున్నారు, పొద్దున్నే లేస్తే నమస్కారాలు పెడుతున్నారు, ఎప్పుడూ గౌరవించని విధంగా భుజాల మీద చెయ్యేసి, చేతిలో చెయ్యేసి షేక్ హ్యాండ్ లిస్తూ, సొంత అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, కుటుంబ సభ్యుల కంటే, బంధు మిత్రుల కంటే ఎనలేని గౌరవాన్ని ఆపాదిస్తూ కేవలం ఓటు ఉన్న ఒకే ఒక కారణంగా అన్ని వరుసలు కలుపుతూ ఒక విఐపి లా చూస్తున్నారు. ఇంతకంటే మరేమీ కావాలి ఈ మానవ జన్మకు అని ఓటర్లు అనుకునేంతగా ఆనంద డోలికల్లో ఉక్కిరి బిక్కిరి చేసుకున్నారు. అందుకే ప్రస్తుత సమాజంలో ఆయా మతాలు,కులాల వారికి ఉన్నట్లుగా, ఏడాదిలో ఎన్నో పండుగలు వస్తున్న విధంగానే ఎన్నికల పండుగ కూడా ఏడాదికోసారి వస్తే నాయకులు, ఓటర్లకు మధ్య మరింతగా అనుబంధం పెరుగుతుందనే అభిప్రాయాలు సర్వత్రాల వినిపిస్తున్నాయి. ఒకసారి ఓటు వేయించుకున్న తర్వాత మళ్లీ ఐదేళ్లదాకా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఓటర్ల ముఖం చూడకుండా ఉంటున్న పరిస్థితులను మార్పు చేసి ఏడాదికోసారి ఓట్లు వస్తే, ప్రతి సంవత్సరం ఓటర్లను రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కలుసుకుంటే ఒక కొత్త వాతావరణం తెలంగాణ సమాజంలో ఏర్పడనుంది.
మైకులు బంద్ ఆయే.. విందుకు వేళాయె..!
సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో వార్డులన్నీ మైకుల హోరు తగ్గి మౌనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పగలు ప్రచారం ముగిసిన రాత్రి తాయిలాల పంపిణీ జోరుగా సాగనుంది. తెల్లవార్లు వార్డులలో తిరుగుతూ ఓటర్లకు కునుకు లేకుండా చేస్తూ చీకటి రాజ్యంలో ఓట్ల వేట దొంగ చాటుగా కొనసాగిస్తున్నారు. కులాల వారిగా, మతాలవారీగా సమీకరణలు జరిపి ఎంచుకున్న ప్రదేశాలలో మందు చుక్క పోస్తూ, చికెన్, చేప, మటన్ ముక్క అందిస్తూ వెజ్, నాన్ వెజ్ ఓటర్ల అభిరుచులకు అనుగుణంగా విందులు బలే పసందుగా జోరందుకున్నాయి. ఎక్కడికక్కడ గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసి తాగరా అన్న తాగి ఊగరా అన్న అంటూ తాగినంత మందు బోసి ఓట్ల పండుగకు బలివ్వడానికి ఓటర్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చాలావరకు మద్యాన్ని తరలించడంతో వైన్సులు ఖాళీగా కనిపిస్తున్నాయి.
చేతిలోన చెయ్యేసి చెప్పెయ్యవా… ఓట్లు నీకే వేస్తానని ప్రామిస్ లు
అన్ని రకాలుగా ఓటర్లను సంతృప్తి చెందిస్తూ పోటీ చేసిన అభ్యర్థులు తమకే ఓటు వేయాల్సిందిగా ఓటర్ల నుండి చేతిలో చేయి వేసి ప్రామిస్ (ప్రమాణం)ప్రతిజ్ఞ చేయించుకుంటున్నారు. నమ్మకం కలిగేదాకా నమ్మ బలుకుతూ తెచ్చి పెట్టుకున్న నవ్వులతో ఆలింగనాలు చేసుకుంటూ, కడుపులో తలపెట్టి ఓటును అభ్యర్థిస్తున్నారు. ఓటర్ దేవుడా నీకు వేల వేల వందనాలు అంటూ కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడుతున్నారు.
మహిళా ఓటర్లకు చీర సారెలు…
మహిళా ఓట్లను ఆకట్టుకోవడానికి వారికి అనుకూలమైన, అందంగా ఉన్న, ప్రత్యేక ఆకర్షణ కలిగిన చీరల గుట్టుగా సాగుతుంది. అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో వంటకు పనికొచ్చే విధంగా రైస్ కుక్కర్లు, పప్పు కుక్కర్లు, కుంకుమ బరినెలు, మరికొన్నిచోట్ల బంగారు గాజులు, ఉంగరాలు, ముక్కుపుడకలు, మరికొన్ని జిల్లాల్లో చెవి దిద్దులు, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, మగ్గం వర్క్ తో కూడిన ఖరీదైన జాకెట్లు పంపిణీ చేస్తున్నారు. రోజు ఇంటికి కేజీ మటన్, చికెన్ చొప్పున పంపిణీ చేస్తున్నారు. పొదుపు సంఘాల, సంఘ బంధాల మహిళలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి ద్వారా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు ఎరవేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్లను ఎంపిక చేసి దేవాలయాలకు, చారిత్రక ప్రదేశాలకు, విహారయాత్రలకు పంపుతున్నారు.
పెరిగిన విందులు, వినోదాలు, గెట్ టుగెదర్ లు…
గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రమంతటా ఎన్నికల పుణ్యమా అని విందులు, వినోదాలు, గెట్ టుగెదర్లు భారీగా సాగుతున్నాయి. తాము ఎంచుకున్న ప్రదేశాలతో పాటు ఫంక్షన్ హాల్ కూడా ముందుగానే బుక్ చేసుకుని పని వాళ్ళని నియమించి అక్కడికే తాగడానికి తినడానికి కావలసిన సరుకు, సరంజామా అంతా పంపించేస్తున్నారు. సంవత్సరం పొడుగునా ఈ విధంగానే ఏదో ఒక ఓట్ల సందర్భం రావాలని, ఓటర్లకు గిరాకీ పెరగాలని, ఓట్ల పండుగా అయితేనే ఓటర్లకు విలువ పెరుగుతుందని, ప్రజాస్వామ్యంలో ఓటును అమ్ముకున్నా, ఎవరేమీ అనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా ఓటరు సంతోషంగా ఉన్నాడా, లేడా అనేదే కొలమానంగా ఉంటుందనేది పలువురి ఓటర్ల మదిలో ఆలోచిస్తున్న నిత్య సత్యం.
ఓటు ఎవరికి వేయాలో డిసైడ్ అయిన ఓటర్
తమ తమ ప్రాంతాలలో పోటీలో ఉన్న ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులలో కేపబుల్ ఎవరు, ఎవరి కెపాసిటీ ఎంత, ఎవరికి వేస్తే ఓటు సద్వినియోగం అవుతుంది, సమస్యలుపరిష్కారం అవుతాయా, పోటీలో అభ్యర్థులు స్థానికులేనా, కాదా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారా, లేదా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారా, ఉండరా, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తారా, లేదా చీదరించుకుంటారా, అవినీతిపరుడా, అజాతశత్రువా, ఆపద్బాంధవుడా ఇలా అన్ని రకాలుగా బేరీజు వేసుకున్న ఓటరు ఒక నిర్ణయానికి వచ్చి ఎవరికి ఓటు వేసి గెలిపించాలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఓటర్లను ఆకర్షించడానికి, వారిని ప్రలోభ పెట్టడానికి, ఓటు పొందడానికి ఎన్నికల సిత్రాలు ఎన్నెన్నో కదా…!