సైట్ విజిట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే
దొంగే దొంగా అన్నట్లు ఉంది
మాజీ మంత్రి హరీష్ రావు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తమ ప్రభుత్వ హయాంలో సైట్ విజిట్ అనేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని పెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సింగరేణి స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, భట్టి విక్రమార్క స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడీ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డే దొంగా అంటుంటే… ఆయనతో మాట్లాడతానని భట్టి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆయన బావమరిది సృజన్ రెడ్డి ప్రధాన సూత్రధారులని ఆరోపించారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు.. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ (దొంగే దొంగ అన్నట్లు) సామెతను గుర్తు చేస్తూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అవినీతికి బాధ్యుడైనప్పుడు, మళ్ళీ ఆయనతో మాట్లాడితే ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించారు. సింగరేణి స్కామ్‌కు బాధ్యులు ఎవరు? ఎంత నష్టం జరిగింది? లబ్ధి పొందింది ఎవరు? ఈ 3 కీలక ప్రశ్నల్లో ఒక్కదానికి కూడ భట్టి సమాధానం చెప్పకుండా దాటవేశారు. ముఖ్యమంత్రి, ఆయన బావమరిది బాగోతం బయటపడకుండా తన 40 ఏళ్ల అనుభవంతో కాపాడే ప్రయత్నం భట్టి విక్రమార్క చేస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
తమకు కావాల్సిన కంపెనీలు టెండర్ దక్కించుకోవడానికి ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ తప్పనిసరి అనే కొత్త నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని హరీష్ రావు ఆరోపించారు. 2018లో సీఎంపీడీఐ సిఫార్సు చేసిందని భట్టి చెబుతున్నప్పటికీ, అది కేవలం వాషింగ్ ప్లాంట్లు వంటి పరిమిత పనులకే వర్తిస్తుందని, ఓబీ (ఓవర్‌బర్డన్) పనులకు కాదని హరీష్ రావు స్పష్టం చేశారు. కేవలం తమ అనుయాయులకు, ముఖ్యంగా సృజన్ రెడ్డికి చెందిన షోడా కన్స్ట్రక్షన్స్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే ఈ నిబంధనను రింగ్ మాస్టర్ లాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అనేక కంపెనీలు సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసినా, కావాలనే నిరాకరించి బ్యాక్ డేటెడ్‌లో తమ వారికి ఇచ్చారని ఈమెయిల్ ఆధారాలను ప్రస్తావించారు.
పతనం అవుతున్న ఉత్పత్తి – నిర్వహణ లోపం
బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది 43 మిలియన్ టన్నులకు పడిపోయిందని హరీష్ రావు గణాంకాలను బయటపెట్టారు. అనుభవం లేని కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడం వల్లే ఉత్పత్తి తగ్గిపోయిందని విమర్శించారు. అలాగే, సింగరేణి లాభాలను ఫుట్‌బాల్ సోకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారాలకు వాడుకుంటూ కార్మికుల బోనస్‌లో కోత విధిస్తున్నారని మండిపడ్డారు.
కార్మిక వ్యతిరేక విధానాలు
వారసత్వ ఉద్యోగాల కోసం గతంలో కేసీఆర్ నెలకు ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే నిర్వహించిందని హరీష్ రావు తప్పుబట్టారు. మెడికల్ బోర్డులో అనవసరమైన కొర్రీలు పెడుతూ వారసత్వ ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తున్నారని, కార్మికులకు కార్పొరేట్ వైద్యం బంద్ చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఖరారైన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నింటినీ వెంటనే రద్దు చేయాలని, నిరాకరించిన కంపెనీల వివరాలు, ఈమెయిల్స్, టెండర్ మీటింగ్ మినిట్స్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈ మొత్తం కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ విచారణ జరిపించాలన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించాలి, లేదంటే సింగరేణి భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు.