ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చని పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

సోమవారం భువనగిరి కేంద్రం లోని 35 వార్డు లో అరైవ్ – అలైవ్” కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీజీపి మహేష్ భగవత్, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రవీందర్, ట్రాఫిక్ డీస్పీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ, ఎం.రమేష్ , ఇన్స్పెక్టర్ భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం అందరి పై ఉందన్నారు.
అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగించడం వంటి అలవాట్లే ప్రమాదాలకు దారితీస్తుంది అన్నారు. అనంతరం జగదేవ్ పూర్ లో గల రోడ్డుగుంతలను ఎ ఎంపి ,అడిషనల్ డీజీపీ మట్టి పోసి గుంతలను పూడ్చారు. అలాగే రోడ్డు పై వస్తున్న వాహనదారున్ని ఆపి హెల్మెట్ డ్రైవింగ్ గురించి అవగాహన కల్పించారు.
ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ముఖ్యంగా నిర్లక్ష్యం అధిక వేగం హెల్మెట్ వినియోగ లేకపోవడం వల్ల మూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు,వార్డ్ మెంబర్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు