Take a fresh look at your lifestyle.

రహదారుల పక్కన చెత్తను తొలగించండి – అధికారులకు కమిషనర్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, బోడుప్పల్:

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి మంగళవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ, స్వచ్ఛ ఆటో వాహనాల ద్వారా చెత్త సేకరణ విధానం, వాటి అవసరాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఎస్. డబ్లు. ఎమ్.) జాహ్నవి శశాంక్ ల ద్వారా కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలో చెత్త సేకరణ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించారు. రహదారుల రెండు వైపులా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని ఈ సందర్భంగా కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (జీవీపీ)లను సమర్థవంతంగా తొలగించి, అక్కడ మళ్లీ చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనంగా, స్వచ్ఛ ఆటో వాహనాల సంఖ్యను పెంచి ఇంటింటి చెత్త సేకరణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా, స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అప్పగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఇట్టి పర్యటన లో ఎ. ఇ ( ఎస్. డబ్లు. ఎమ్ ) మహేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.