ముద్ర, తాండూర్:
పార్టీలకతీతంగా తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి నూతన మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తాండూర్ ప్రాంతానికి అధిక నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. సోమవారం తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి, వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజాక్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ చాంబర్లో వేద పండితులచే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్ధి కోసం అందరూ ముందుకు రావాలని తెలిపారు. తాండూరు ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని నిధులైన ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని, విజన్ 2028 నాటికి తాండూర్ రూపు
రేఖలు మార్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. పార్టీలకతీతంగా అన్ని వార్డుల్లో సమాన అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏ వార్డు పైన కూడా చిన్నచూపు చూడకుండా అందరితో కలిసి మెలసి అభివృద్ధి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు. పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్
మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.