Take a fresh look at your lifestyle.

చిన్నారుల ప్రాణ భద్రతపై పోలీసుల అప్రమత్తత-* బావుల వద్ద ప్రమాదాలు నివారించేందుకు అవగాహన కార్యక్రమం

 

 

ముద్ర,‌జోగుళాంబ ప్రతినిధి:

జిల్లాలో మల్దకల్ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉన్న బావుల వద్ద ఇటీవల చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఈత కొట్టడానికి వస్తుండటంతో వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆదివా‌రం‌ మల్దకల్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, మల్దకల్ ఎస్ఐ శ్రీహరి సూచనలతో పోలీసు కానిస్టేబుల్స్ బీమరాయుడు, సుధాకర్ లు  మండలంలోని పలు గ్రామాల్లోని బావుల వద్దకు వెళ్లి అక్కడ ఈతకు వచ్చిన చిన్నారులకు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీసులు చిన్నారులకు పలు జాగ్రత్తలు సూచించారు. పిల్లలు ఎప్పుడైనా బావులకు ఈత కొట్టడానికి వెళ్లాలనుకుంటే ముందుగా ఇంట్లో తల్లిదండ్రులకు లేదా పెద్దలకు తప్పనిసరిగా చెప్పి వారి సహాయంతో మాత్రమే వెళ్లాలని సూచించారు. సరదాగా లేదా ఆకతాయి తనంతో స్నేహితులతో కలిసి ఒంటరిగా బావులకు వెళ్లడం చాలా ప్రమాదకరమని, అలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు.

పిల్లలు బావుల వద్ద ఆడుకోవడం లేదా ఈత కొట్టడం సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బావుల వద్ద జారిపడే ప్రమాదం కూడా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈత బాగా రాకపోయినా సరదాగా నీళ్లలోకి దిగడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందువల్ల పిల్లలు ఎప్పుడూ ఒంటరిగా బావులకు వెళ్లకుండా పెద్దల పర్యవేక్షణలోనే ఈత కొట్టాలని సూచించారు.

అలాగే పిల్లలు బావులకు వెళ్లే ముందు ఇంట్లో పెద్దలకు తెలియజేయాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పేర్కొన్నారు. పిల్లలు నీళ్లలో ఉన్న సమయంలో పెద్దలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని తెలిపారు.

ప్రాణం విలువ ఎంతో గొప్పదని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా చిన్నారులకు పోలీసులు వివరించారు. గ్రామాల్లోని బావుల వద్ద భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మల్దకల్ పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.