ముద్ర ప్రతినిధి, నిర్మల్:
సిఎంఆర్ డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సిఎంఆర్ డెలివరీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. సిఎంఆర్ కు సంబంధించిన వివరాలను మిల్లర్ల వారిగా సమీక్షించారు. సిఎంఆర్ డెలివరీలో వెనుకబడిన మిల్లర్లు, ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. అన్ని మిల్లులలో, మిల్లులకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రికార్డుల నిర్వహణకు సంబంధించి అధికారులు, మిల్లర్లకు అవగాహన కల్పించాలని వివరించారు. సీఎంఆర్ ప్రక్రియలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వరి ధాన్యపు సంచులు ఉంచడానికి తగిన గోదాములు ఇతరత్రా ప్రదేశాలు అన్వేషించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల ద్వారా ధాన్యపు సంచులను తరలించాలని, ధాన్యపు సంచులు కొనుగోలు కేంద్రాల్లో ఉండకూడదన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, రైస్ మిల్లర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.