Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

 

రైతులు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.

లారీలు, గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.

మంగళవారం గద్వాల మండలంలోని చెనుగోనుపల్లి, అనంతపురం1, బసల్ చెరువు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండి, లారీలు తక్కువగా ఉండటం వలన కొనుగోలు ప్రక్రియ ఆలస్యమై రైతులు చాలా రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తున్నదని గమనించిన కలెక్టర్, అవసరమైన మేరకు అదనపు లారీలు ఏర్పాటు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంకు రోజుకు కనీసం నాలుగు లారీలు పంపించి రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యమును సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. రైతులు ఎండలో ఎక్కువసేపు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ధాన్యం ఎక్కువగా వచ్చిన కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చి, సమీప మిల్లులకు పంపడం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు. ప్రతి కేంద్రానికి నిర్దిష్టంగా సమీపంలోని మిల్లులను కేటాయించి, అధికారిక ఆదేశాల ప్రకారం మాత్రమే కొనుగోలు చేసిన ధాన్యమును లారీల్లో తరలించాలన్నారు. గన్నీ సంచుల కొరతపై స్పందించిన కలెక్టర్ పాత, దెబ్బతిన్న సంచులను వాడకుండా కొత్త గన్నీలు వెంటనే సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రాల వారీగా అవసరాన్ని అంచనా వేసి సరిపడా గన్నీలను పంపిణీ చేయాలని సూచించారు.
కేంద్రాల్లోనీ రిజిస్టర్లలో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు, మిల్లులకు రవాణా చేసిన వివరాలు, ఫోన్ నంబర్లు, తదితర తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. ప్రతి రోజూ కేంద్రంలో ఉన్న ధాన్యం నిల్వలు, తేమ శాతం వచ్చిన పరిమాణం, పంపిన లోడ్ల వివరాలను నమోదు చేసి అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేసి సంబంధిత ఉన్నతాధికారులతో తక్షణ పరిష్కారం పొందాలని ఆయా కేంద్రాల ఇన్చార్జిలకు, అధికారులకు సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షం పడితే తడవకుండా సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు టార్పాలెన్స్ కప్పి వెళ్లాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును సంబంధిత అధికారులు తరచూ పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే, అవకతవకలకు పాల్పడితే సంబంధిత కేంద్రాల ఇన్చార్జిలు, అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. అనంతపురం కొనుగోలు కేంద్రం సమీపంలో ఉన్న రైతువేదికలో ఉంచిన గన్ని సంచులు, టార్పాలెన్స్, తదితర కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఆయా కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యంను, లారీల్లో మిల్లులకు తరలిస్తున్న ధాన్యం బస్తాలను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడారు.

ఈ తనిఖీలో డిఆర్డిఏ ఏపీడి శ్రీనివాస్, డిపిఎం అరుణ, ఏఈఓ లు ఉషశ్రీ, రవి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.