ముద్ర, కరీంనగర్:
వ్యవసాయ మార్కెటింగ్‌లో సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారితనం పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-నామ్ 2.0 అమలు, సాంకేతిక సమస్యలు మరియు పరిష్కారాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ-నామ్ కింద 57 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఎంపిక కాగా, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర మార్కెట్ కమిటీలు ఎంపికయ్యాయి. ప్రస్తుతం ఈ కమిటీల్లో ఈ-నామ్ 1.0 అమలులో ఉంది. ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో మెరుగైన ఫీచర్లతో రూపొందించిన ఈ-నామ్ 2.0ను ప్రభుత్వం ప్రవేశపెట్టగా, చొప్పదండి మార్కెట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ ఈ-నామ్ 2.0 ద్వారా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావడం వల్ల లావాదేవీలు పారదర్శకంగా జరిగే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా మార్కెటింగ్ సామర్థ్యం పెరగడంతో పాటు జవాబుదారితనం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
అమలు దశలో ఎదురైన సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించి, వాటిని త్వరగా పరిష్కరించి ఈ-నామ్ 2.0ను విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్, మార్కెటింగ్ శాఖ అధికారులు, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.