బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం అసెంబ్లీ లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన బోథ్ నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ముఖ్యంగా నియోజకవర్గం కేంద్రమైన బోథ్ లో జనరల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బోథ్ లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేశారని గుర్తుచేశారు. కానీ ఆసుపత్రి నిర్మాణం నేటికి పూర్తి కాలేదని ఆసుపత్రి నిర్మాణంను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంకు ప్రధాన ఆసుపత్రి అయినప్పటికీ కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని పూర్తి స్థాయి డాక్టర్ లను నియమించాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు భవన నిర్మాణాలకు బిల్లులు వెంటనే మంజూరు చేసి పూర్తి చేయాలని కోరారు.