Take a fresh look at your lifestyle.

పోటాపోటీగా వార్డుల్లో ఎన్నికల ప్రచారం

 

రోజు రోజుకు పుంజుకుంటున్న బీజేపీ, టీఆర్ఎస్

కాంగ్రెస్ అభ్యర్థులకు వార్డుల్లో సీనియర్ నాయకులకు సఖ్యత కరువు

పరిస్థితి ఇట్లానే ఉంటే కాంగ్రెస్ మూడో స్థానానికి…!

కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థి పేరును ప్రకటించి తప్పు చేసిందా?

ముద్ర, నారాయణ పేట:

నారాయణపేట పట్టణంలో ఎలాగైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతం చేసుకోవాలని పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. అభ్యర్థుల పేర్ల ఖరారు…. బీఫామ్ ల అందజేత తర్వాత రోజురోజుకు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల గ్రాఫ్ పడిపోతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఏమిటంటే…. కాంగ్రెస్ పార్టీలో చాలామంది కౌన్సిలర్ టికెట్ కోసం పోటీపడ్డారు. చివరి నిమిషం వరకు టికెట్టు వస్తుందని ఆశించిన కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న పలువురికి చేదు అనుభవం ఎదురయింది. దీంతో వార్డుల్లో ప్రచారంలో కొంత జోష్ తగ్గిందని చెప్పవచ్చు. కేవలం మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి, చిట్టెం అభిజయ్ రెడ్డి లు వార్డుల్లో పర్యటనలు చేస్తున్న సమయంలోనే వార్డులలో జనాల సందడి కనిపిస్తుంది. ఈ జనాలు అంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారా అని అంటే వారంతా ఎన్నికల ప్రచార కూలీలు అని చెప్పవచ్చు. సామాన్య ప్రజలు ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసినదే. ఏది ఏమైనాప్పటికీ కాంగ్రెస్ కు మాత్రం మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతుగా ఉంది. కాంగ్రెస్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత కష్టపడ్డా ఏడు స్థానాలకు మించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. వీరికి ఎంఐఎం మద్దతు తెలిపిన కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య పది దాటే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సైతం పట్టణంలో రోజు నాలుగు వార్డుల చొప్పున జోరుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఎంపీ డీకే అరుణ సైతం జిల్లా కేంద్రంలో మున్సిపల్ పీఠం బిజెపి సొంతమయ్యేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలో నీ సత్యనారాయణ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బిజెపి టిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటైతే మాత్రం జిల్లా కేంద్రంలో అనుకున్నదొకటి అయినది మరొకటి అనే చందంగా పరిస్థితులు ఉండే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పాత కొత్త నాయకుల మధ్య కుదరని సఖ్యత

కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేశారు. వీరిలో కొంతమందికి కౌన్సిలర్ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇతర పార్టీ నుంచి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్ ఇవ్వడంతో ఏళ్లుగా కష్టపడి పని చేసిన వారికి ఇచ్చిన గుర్తింపు ఇదేనా అని కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులకు లోలోపల వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమను కాదని ఇతరులకు టికెట్ ఇస్తే ఎలా పనిచేస్తామని కొంతమంది పార్టీకి దూరంగా కూడా ఉంటున్నారు. ఈ పరిస్థితి మరికొన్ని వార్డులలో ఇలాగే కొనసాగితే మాత్రం కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు.

కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థి పేరును ప్రకటించి తప్పు చేసిందా?

వాస్తవానికి బిజెపి టీఆర్ఎస్ తమ పార్టీ నుంచి చైర్పర్సన్ అభ్యర్థి పేరును అధికారికంగా నేటికీ ప్రకటించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చైర్పర్సన్ అభ్యర్థి పేరును ప్రకటించింది. ఈ ప్రకటించిన నాటి నుంచే కాంగ్రెస్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీని అంటిపెట్టుకున్న వారిని కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడం…పైగా చైర్ పర్సన్ అభ్యర్థిని పేరును ప్రకటించడం కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లో కొంత నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.