ఉమ్మడి జిల్లాల్లో రాజకీయ కలకలం జగిత్యాలలో జీవన్ రెడ్డి హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి అంతర్గత పోరు.. పార్టీ మార్పుల సంకేతాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హుజూరాబాద్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితిలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై బయటకు వచ్చిన వీడియో వైరల్ గా మారింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారాయి. ముఖ్యంగా హుజూరాబాద్, జగిత్యాల ప్రాంతాల్లో పార్టీ అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని, భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం మాటల యుద్ధంగా కాకుండా, పార్టీ మార్పుల దిశగా మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితిలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జమ్మికుంట ప్రాంతంలో జరిగిన రహస్య సమావేశం ఈ విభేదాలను మరింత బహిర్గతం చేసింది. ఈ సమావేశానికి వందకు పైగా కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో పలువురు నాయకులు ఎమ్మెల్యేపై నేరుగా విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా కష్టపడ్డ సీనియర్ నేతలను పక్కనబెట్టి, వ్యక్తిగత అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. కొన్ని స్థానిక వివాదాలను పార్టీపైకి మోపడం వల్ల కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కూడా ఎమ్మెల్యే నిర్ణయాలే కారణమని కొందరు కౌన్సిలర్లు వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఫిరాయింపులకు కారణమా..?
ఈ అసంతృప్తి క్రమంగా పార్టీ ఫిరాయింపులకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు అసంతృప్తి నేతలు ఇప్పటికే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే సమయంలో జగిత్యాల రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఈనెల 25న తన అనుచరులతో కలిసి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా కేంద్రంలో కీలక సమావేశం నిర్వహించి, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాల మధ్య మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో భేటీ కావడం పరిస్థితిని కొంతమేర మార్చినట్లు కనిపిస్తోంది. ఆ చర్చల తర్వాత జీవన్ రెడ్డి వైఖరిలో స్వల్ప మార్పు కనిపించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తుది నిర్ణయం ఇంకా ప్రకటించకపోయినా, ఆయన తదుపరి అడుగులపై ఉత్కంఠ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు, మరోవైపు కాంగ్రెస్ నాయకుల్లో మార్పులు. మరి, రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో ఆసక్తిగా మారింది.