ముద్ర ప్రతినిధి, మెదక్:
పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని, ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం చాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.

సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై వర్క్ షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాల్లో 15వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ, పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15వ ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని, వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగంలో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించకపోతే, అక్రమాలు జరిగితే సర్పంచ్, కార్యదర్శులపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు.
గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఈ.ఈ మిషన్ భగీరథ సంపత్ కుమార్, గ్రిడ్ డి.ఈ నాగభూషణం, డిఎల్పిఓలు సాయిబాబు, తిరుపతి రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.