Take a fresh look at your lifestyle.

ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం.

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:

ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉండడం ప్రధానమని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఎవరైనా సరే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

మంగళవారం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గద్వాల పాత డీఎంహెచ్వో కార్యాలయం వద్ద గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ హెల్త్ డే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులతోపాటు ముఖ్య అతిధులు, వైద్య సిబ్బంది ర్యాలీలో పాల్గొనగా పాత బస్టాండ్ మీదుగా కృష్ణవేణి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్” నినాదంతో ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే ను నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా వైద్యాధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి మనిషి తమ జీవితంలో వ్యాయామాన్ని, యోగ, ధ్యానంను ఒక భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ మనిషికి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృధానే అని అభిప్రాయపడ్డారు. అందుకే మన పెద్దలు “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నినాదాన్ని చెప్పడం జరిగిందన్నారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేసి అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, డిడబ్ల్యుఓ సునంద, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, పలువురు కౌన్సిలర్లు, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు, వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.